Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ మండలంలో పలు రహదారులు ప్రమాదకరంగా, అత్యంత దారుణంగా ఉన్నాయి. బోనకల్ - చిరునోముల రోడ్డు కేవలం మూడు కిలోమీటర్ల దూరమే ఉన్నప్పటికీ మండలంలో అత్యంత ప్రమాదకర రోడ్డుగా తయారైంది. ఆర్అండ్బీ రోడ్డు అయినప్పటికీ కనీసం ఒక రెండు మీటర్ల దూరం కూడా బీటీ రోడ్డు కనిపించదు. అడుగడుగున పెద్ద పెద్ద గుంతలతో అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఈ రహదారిపై ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది గాయాలు పాలవుతున్నారు. ఇదే రహదారిపై చిరునోముల వద్ద బోనకల్ బ్రాంచ్ కెనాల్ పై గల బ్రిడ్జి కూలిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రజలు భయం భయంగా బ్రిడ్జి పై వెళ్తున్నారు. బోనకల్లు-చిరునోముల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా వుందని జిల్లా రవాణా శాఖ మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి స్వయంగా కలిసి గ్రామస్తులు మరో పెట్టుకొన్నా కనికరించడం లేదు. రాపల్లి క్రాస్ రోడ్డు నుంచి రాపల్లి వరకు గల రోడ్డు ప్రమాదకరంగా తయారైంది. బీటీ లేచిపోయి ఉంది. రాపల్లి రోడ్డు గుండా వెళ్ళితే ప్రమాదానికి గురి కావాల్సిందే. బోనకల్ - ఖమ్మం ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారింది. మండల కేంద్రంలోని స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో రోడ్డుకు అడ్డంగా ఓ పెద్ద గుంత ప్రమాదకరంగా ఉంది. ఈ గుంత వద్ద ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సైతం ఈ రహదారి గుండానే వెళ్తున్నప్పటికీ పట్టించుకున్న వారు లేరు. బోనకల్లు నుంచి ముష్టి కుంట వరకు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారింది. బిబిసిపై గల బ్రిడ్జి సమీపంలో పెద్ద పెద్ద గుంతలతో ప్రమాదకరంగా రోడ్డు ఉంది. ఇటీవలే బోనకల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మోటార్ సైకిల్ పై వెళ్తూ గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఎన్ఎస్పి బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముష్టికుంట్ల-చొప్పకట్లపాలెం రోడ్డు కూడా అద్వానంగా ఉంది. మండలంలో రహదారులు అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.