Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ క్యాంప్లు వద్దు.. పాఠశాలు ముద్దు
- మూడు వేల మందితో భారీ, ర్యాలీ ప్రదర్శన
నవతెలంగాణ-చర్ల
''ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్లో పోలీస్ శిబిరం ఏర్పాటు ను నిరసిస్తూ ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ఘటన మరువక ముందే బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల యాంపురం ఆదివాసీ గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది''.
బీజాపూర్ జిల్లా పామేడు పోలీసు స్టేషన్ పరిధిలోని యాంపురం గ్రామంలో పోలీసు శిబిరం ఏర్పాటుకు వ్యతిరేకంగా అదివాసీలు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఉడతమల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని యాంపురంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను సీఆర్పీఎఫ్ శిబిరం ఏర్పాటు కోసం ఇటీవల అధికారులు పరిశీలించి ఎంపిక చేసుకొని వెళ్ళారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఏ క్షణంలోనైనా శిబిరం ఏర్పాటు చేస్తారని భావించిన ఆదివాసీలు తమ భూముల వద్ద గుడారాలు వేసుకుని ఉంటున్నారు. గత 15 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శిబిరం ఏర్పాటు ను నిరసిస్తూ యాంపురం లో వేలాదిమంది నిరసన వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున బ్యానర్లు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.
యాంపురం లో పోలీస్ శిబిరం పెట్టొద్దని, క్యాంపులు వద్దు స్కూలు, ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, ప్రతీ గ్రామానికి వైద్య సేవలు అందించాలని, కోవిడ్ వాక్సినేషన్ టీకాలు అటవీ ప్రాంతంలో ఉన్న అందరికీ వేయాలని, గిరిజనులపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఉడతమల్ల పంచాయతీ పరిధిలోని యాంపురం, ఉడతమల్ల, రాచపల్లి, పినచందా, బట్టెంతోంగు గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు సుమారు మూడు వేల మంది ర్యాలీ నిర్వహించారు. తాము గత అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుందని ఆందోళన చెందుతున్నారు. శిబిరం ఏర్పాటు చేస్తే యాంపురంనకు చెందిన కరక సత్యం, కరక అర్జున, సున్నం. బాబురావు, సోడి. భీమయ్యలకు చెందిన 35 ఎకరాల వ్యవసాయ భూమి కోల్పోవాల్సి వస్తుందని బాధితులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను పోలీసు శిబిరానికి ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. భూములు కోల్పోయి తాము రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.