Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
పాలకుల నేరపూరిత నిర్లక్ష్యంపు విధానాలు, కార్మిక వ్యతిరేక సంస్కరణలతో నిర్వీర్యం అవుతున్న సింగరేణి సంస్థను కార్మికోద్యమాలతోనే జీవంపోసి పూర్వవైభవం తీసుకురావాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. సింగరేణి సంస్థను పరిరక్షించాలని, ప్రభుత్వ ఆర్థిక దోపిడి, రాజకీయ జోఖ్యాన్ని నివారించాలని, ముఖ్యమంత్రి హామీలు అమలు చేయాలని, పెడింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో రెండు రోజులు చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షను మంగళవారం పువ్వాడ ప్రారంభించారు. కూనంనేనికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి పువ్వాడ మాట్లాడారు. గతంలో సింగరేణి సంస్థను బీఐఎఫ్్ఆర్ ముప్పు నుంచి కాపాడిన చరిత్ర ఏఐటియుసిదని తెలిపారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో అవే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. 6 ఏండ్ల కాలంలో కేవలం రాయాల్టీ పేరుతోనే రూ.9.255 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందని తెలిపారు. వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, దీక్షలో కూర్చున్న కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మితిమీ రిన రాజకీయ జోక్యంతో సింగరేణి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీక్షాల శిభిరాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు, బాలశౌరి, సీఐటీయూ నాయకులు గాజుల రాజారావు, వై.వెంకటేశ్వర్లు, విపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఐఏఎల్, టిజిఎస్, డిహెచ్ పిఎస్, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఆటో వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నేతల బృందం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాధం, వై.శ్రీనివాసరెడ్డి, సమితి సభ్యులు శ్రీనివాస్, కంచర్ల.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.