Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
డ్రై డే అంటే రోడ్లపై బ్లీచింగ్ చల్లిటం కాదు.. డీ వాటరింగ్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్ అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం మాధారం గ్రామంలో పర్యటించారు. కలెక్టర్‌కు సర్పంచ్ అజ్మీర నరేష్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఎంత మంది విధులు నిర్వహిస్తు న్నారని వాకబు చేశారు. ఈ సందర్భంగా మాస్కు లేకుండా వస్తున్న గ్రామస్తుడు బట్టు నర్సయ్యను పిలిచి ఫైన్ వేయమని కార్యదర్శి నరేష్‌ను ఆదేశించటంతో నర్సయ్యకు రూ.1000 పెనాల్టీ విధించారు. మాస్క్ ధరించి, పారిశుధ్యం పాటిస్తే కరోనా రాదన్నారు. ప్రజలను మాస్కు ధరింపచేయటంలో అలసత్వ వహించాడంటూ కార్యదర్శికి మెమో జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. వీధులను పరిశీలించిన కలెక్టర్ ఎస్కె.బందేలి ఇంటి వద్దరోడ్డు పక్క నీరు నిలిచి ఉండటాన్ని గమనించి సర్పంచ్ నరేష్‌ను ప్రశ్నించారు. నూతనంగా రోడ్డు పోశారని త్వరలో సైడు మరం పోస్తామని తెలిపారు. బందేలి ఇంట్లో ట్రాక్టర్ టైర్లు పడేసి ఉండటాన్ని గమనించి టైర్లలో నీటి నిల్వ ఉండటాన్ని చూచి కుటుంబ సభ్యులను పిలిచి, ఇలా నీరు నిల్వలతోనే దోమల వ్యాప్తి జరిగి మీతో పాటు చుట్టుపక్కల వారికి వ్యాధులు వస్తాయన్నారు. ఆ కుటుంబ యజమానికి జరిమానా విధించమని కార్యదర్శిని ఆదేశించారు. ఇంటింటికిి వెళ్లుతున్న వైద్య సిబ్బంది సగం సగం పనులు చేస్తున్నారన్నారు. ఇంటి యాజమానులతో నీటి నిల్వను తీసివేయించేదాకా ఉండాలని సూచించారు. గ్రామంలో హౌం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులతో మాట్లాడారు. హౌం ఐసోలేషన్ సరైంది, కాదని ప్రత్యేక ఐసోలేషన్‌కు తరలించటం ద్వారా కరోనా వ్యాప్తి జరగదన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తున్నారా అని వైద్యురాలు డాక్టర్ నెల్లూరి చందనను ప్రశ్నించారు. ప్రతి రోజు గ్రామస్తులను చైతన్యం, సూచనలు చేస్తూ మైక్ ప్రచారం చేయాలన్నారు.
కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో మాలతి, డీఎంవో సంధ్య, పీడీ విద్యాచందన, డీఎల్పీవో పుల్లారావు, ఏపీఆర్వో శ్రీనివాసరావు, తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఎంపీవో టీవీఎల్‌ఎన్ శాస్త్రీ, పీఆర్ ఏఈ నాగిరెడ్డి, వైద్యురాలు డాక్టర్ నెల్లూరి చందన, ఉపసర్పంచ్ భాగం వెంకటప్పారావు, ఏఎన్ఎం పుష్ప తదితరులు పాల్గొన్నారు.