Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
- విద్యుత్ సవరణ బిల్లు విరమించుకోవాలి
- విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల ధర్నా
- సంఘీభావం తెలిపిన సిఐటియు
నవ తెలంగాణ-భద్రాచలం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ చట్టం సవరణ బిల్లు 2020-2021ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కవ్నిటి ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎలక్ట్రసిటి ఎంప్లాయిస్ దేశ వ్యాప్తపిలుపులో భాగంగా భద్రాచలం డీఈ కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగులు కార్మికులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటియు సంఘీభావం తెలిపింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ ధర్నాకి సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడారు. దేశానికి జీవనాడి విద్యుత్ రంగమని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు బిజెపి ప్రభుత్వం తెచ్చిన విద్యత్ చట్టసవరణ బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ చట్టం వస్తే క్రాస్ సబ్సిడీ పోతుందని, తద్వారా 100, 200 యూనిట్లలోపు ఉన్న మన రాష్ట్రంలోని 59 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు వారి ఛార్జీలలో పొందుతున్న రాయితీ పోతుందని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి అయిన ఖర్చు ప్రకారం టారీఫ్‌ను చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అలాగే మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందిన క్షౌరశాలలకు, లాండ్రీ షాపులకు (250 యూనిట్ల) ఇస్తున్న విద్యుత్తు రాయితీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల రైతుల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడతారని, ఉచిత కరెంటు ఉండదని, రైతులు ముందుగా కరెంటు బిల్లులు చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వ్యవసాయదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతారని తెలిపారు. ఇంజనీర్స్ అసోషేసియన్ తరుపున ఏఈ రాజేష్ మాట్లాడుతూ ఈ బిల్లు చట్టంగా మారితే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలోకి ప్రయివేటు సంస్థలు, ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్స్‌దారుల ప్రవేశం వల్ల మన రాష్ట్రంలోని 50వేల మంది ఉద్యోగులు, ఇంజనీర్లు, 23,600 మంది ఆర్టిజెన్లు, 6,500మంది పీస్ రేటు వర్కర్స్, అన్మెన్ వర్కర్స్ ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలకు ప్రయత్నిస్తే ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించి విజయం సాధించిన అనుభవం ఉందన్నారు. వారి స్ఫూర్తితో దేశవ్యాప్త ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగులు సిద్ధంగావున్నారని తెలిపారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె బ్రహ్మాచారి, యుఈఈయు జిల్లా అధ్యక్షులు కొలగాని రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ నాయకులు కె.టి.యన్.మూర్తి, ఏఈ ఉపేందర్, ఏఏఓ సత్యనారాయణ, 327యూనిన్ త్రినాద్ రెడ్డి, యుఈఈయు నాయకులు బడిగే.రమేష్, శంకర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.