Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అశ్వారావుపేట, దమ్మపేట కేంద్రాల నుంచి 8లక్షల మొక్కల పంపిణీ లక్ష్యం
నవతెలంగాణ-బోనకల్
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 21 మండలాల్లో పామాయిల్ సాగు లక్ష్యం 3,315.45 హెక్టార్లు. ఇందులో బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, కల్లూరు, కామేపల్లి, కూసుమంచి, నేలకొండపల్లి, పెనుబల్లి, వేంసూర్, సత్తుపల్లి కారేపల్లి, తల్లాడ, వైరా మండలాలలో 3,092.45 హెక్టార్లలో సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఏన్కూరు, ఖమ్మం రూరల్, కొణిజర్ల, రఘునాధపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ మండలాలలో 223 హెక్టార్లలో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఆరు మండలాలను గోద్రెజ్ ఆగ్రో ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యత కేటాయించారు. అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం దమ్మపేట మండలం అప్పారావుపేట కేంద్రాల నుంచి గత ఏడాది ఆరు లక్షల పామాయిల్ మొక్కలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఈ కేంద్రాల నుంచి 8 లక్షల మొక్కలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో వైరా, ముదిగొండ, ఎర్రుపాలెం, పెనుబల్లి, సత్తుపల్లి కేంద్రాలలో పామాయిల్ పంట సేకరణ కేంద్రాలుగా నిర్ణయించారు. సేకరణ కేంద్రాల నుంచి పామాయిల్ పంటను అశ్వరావుపేట మండలంలోని నారావారిగూడెం దమ్మపేట మండలం లోని అప్పారావుపేట కేంద్రాలకు సంస్థ నియమించిన కాంట్రాక్టర్లు తరలించవలసి ఉంది. ముదిగొండ సేకరణ కేంద్రం ద్వారా సేకరించిన పంటను అశ్వారావుపేట, దమ్మపేట తరలించేందుకు సదరు కాంట్రాక్టర్ కు సంస్థ మెట్రిక్ తన్నుకు 985 రూపాయలు, వైరా కేంద్రం నుంచి తరలిస్తే 785 రూపాయలు, సత్తుపల్లి కేంద్రం నుంచి తరలిస్తే 650 రూపాయలు సంస్థ వారికి చెల్లిస్తుంది. అదేవిధంగా రైతులకు సేకరణ కేంద్రాలకు తరలించినందుకు కూడా రవాణా ఖర్చులను చెల్లిస్తుంది. 15 కిలోమీటర్ల లోపు అయితే మెట్రిక్ తన్నుకు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు, 15 నుంచి 50 కిలోమీటర్ల లోపు అయితే నాలుగు వందల పదిహేను రూపాయలు, ఖమ్మం నుంచి అయితే 645 రూపాయలను రైతులకు చెల్లిస్తుంది. ప్రతి నెల 1వ తేదీన పామాయిల్ ధరను అధికారులు నిర్ణయించి ప్రకటిస్తారు. ఆ నెల చివరి వరకు అదే ధర రైతులకు చెల్లించబడుతుంది. జూలై నెల ధరను 16,865 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతి సంవత్సరం జూన్ నెల ప్రారంభంలో అస్వరావుపేట, దమ్మపేట కేంద్రాల నుంచి పామాయిల్ మొక్కలను రైతులకు సరఫరా చేస్తారు. మధిర నియోజకవర్గంలో ఈ ఏడాది 70 హెక్టార్ల లో పామాయిల్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మధిర ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఆకుల వేణు తెలిపారు.