Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
2018 నుంచి ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల అభివృద్ధి కాగితాలలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది కానీ ఆచరణలో శూన్యం. 2018-2019 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు బ్యాంకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం దళితుల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. బోనకల్ మండలంలో 2018 నుంచి 2021-22 సంవత్సరం వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులలో ఒక్కరికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018-19 సంవత్సరానికి గాను బోనకల్ మండలం నుంచి లక్ష రూపాయల యూనిట్కి 29 మంది లబ్ధిదారులను, పెటి స్కీమ్ కింద (రూ 50,000) మరో 28 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం మండలం నుంచి 668 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొత్తం 47 మందిని మాత్రమే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఇందులో 2 లక్షల రూపాయల రుణం కోసం ఏడుగురిని, లక్ష రూపాయల రుణం కోసం 22 మందిని ఎంపిక చేశారు. 50 వేల రుణం కోసం 28 మందిని మాత్రం ఎంపిక చేశారు. వీరందరికీ మండల పరిషత్ కార్యాలయం నుంచి గ్రౌండ్ చేసి ఆయా బ్యాంకులకు పంపించారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడుకి విడుదల చేయవలసిన సబ్సిడీ నేటి వరకు విడుదల చేయలేదు. ప్రభుత్వం లక్ష రూపాయల రుణం మంజూరు చేస్తే లబ్ధిదారుడి వాటాగా 20 వేల రూపాయలు బ్యాంకులో చెల్లించవలసి ఉంది. రుణాలు మంజూరు అయిన లబ్ధిదారులు అందరూ తమ వాటాగా బ్యాంకులో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం విడుదల చేయవలసిన సబ్సిడీని బ్యాంకులకు విడుదల చేయకపోవడం వల్ల బ్యాంకు వాళ్లు లబ్ధిదారులకు రుణం డబ్బులను ఇవ్వటం లేదు. దీంతో లబ్ధిదారులు రుణాల కోసం ఖమ్మంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కూడా 2018 సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మాత్రం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, ఇందులో తాము చేసేది ఏమీ లేదని, తాము చేయాల్సిన గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసి సంబంధిత బ్యాంకులకు పంపించామని స్పష్టం చేస్తున్నారు. కానీ మండల పరిషత్ కార్యాలయంలో మాత్రం 2018-19 సంవత్సరానికిగాను మండలం నుంచి నలభై ఏడు మందికి రుణాలు మంజూరు చేసినట్లు బ్రహ్మాండంగా కాగితాల లో కనిపిస్తుంది. కానీ ఆచరణ వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం చెల్లించవలసిన సబ్సిడీ నిధులను చెల్లించలేదు. దీంతో లబ్ధిదారులు రుణాల కోసం చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఇలా ఉండగా 2019 - 2020 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు. ఈ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎటువంటి రుణాల కార్యక్రమం చేపట్టలేదు. 2021- 2022 సంవత్సరానికి గాను ఎస్సీ కార్పొరేషన్ నుంచి రెండు లక్షల రుణం కోసం 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి నాలుగు నెలలు కావస్తోంది. మండల స్థాయిలో 5 లక్షల చొప్పున ఇద్దరు లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయవలసి ఉంది. మండల స్థాయిలో ఇద్దరిని ఎంపిక చేయాలి కానీ ఇంతవరకు ఆ ఇద్దరి లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. ఈ సంవత్సరా నికి గాను మొత్తం 458 మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అందులో కేవలం 25 మందిని మాత్రమే ఎంపిక చేశారు. రెండు లక్షల రూపాయలకు సంబంధించి లబ్ధిదారుల గ్రౌండ్ వర్క్ మొత్తం మండల పరిషత్ కార్యాలయం నుంచి పూర్తి చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం అందుకు సంబంధించిన లిస్టును అందజేశారు. అదేవిధంగా సంబంధిత బ్యాంకులకు కూడా లబ్ధిదారుల ఎంపిక వివరాలను అందజేశారు. కానీ ఇందులో కూడా ఒకరికి కూడా నేటికీ ప్రభుత్వం విడుదల చేయవలసిన నిధులను బ్యాంకులకు విడుదల చేయలేదు ఇది ఇలా ఉండగా మండల స్థాయిలో 5 లక్షల యూనిట్లకు సంబంధించి ఇద్దరిని చేయవలసి ఉన్నప్పటికీ అది నేటికీ అధికారులు ఎంపిక చేయలేదు ఏ విధంగా 2018 నుంచి 2021 సంవత్సరాల వరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల లో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. కానీ ఈ ఏడాది కూడా 25 మంది దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేశామని రికార్డులలో బ్రహ్మాండంగా మోత మోగిపోతుంది. కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే ఒక్కరికి కూడా నేటి వరకు రుణాలు అందలేదు. దీంతో ఎంతో ఆశతో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తుందని ఎదురుచూసిన రెండు దఫాలుగా ఎంపికైన లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతుంది.