Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాథపాలెం
పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. కామంచికల్ గ్రామంలో డంపింగ్ యార్డ్ తరలించాలని జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను పోతినేని సుదర్శన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామం చికల్ నుండి డంపింగ్ యార్డు తరలించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగర కార్పొరేషన్ అధికారులు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఖమ్మం కంటే కూడా చిన్నవిగా వున్న మున్సిపాలిటీల్లో నూతన పద్ధతులను అవలంబిస్తూ చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు అనేక వ్యాధులు సోకి వారి ప్రాణాల మీదికి వస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అంటూ విమర్శించారు. కామంచికల్ డంపింగ్ యార్డు నిర్వహణలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా చట్టాలను ఉల్లంఘించార న్నారు. హాస్పటల్ వ్యర్థాలను, ఎలక్ట్రానిక్ వస్తు వులు, ప్లాస్టిక్ వ్యర్థాలను పంట పొలాల్లో పోయడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమని వారు అన్నారు. డంపింగ్ యార్డు నుంచి వర్షం వచ్చిన ప్పుడు వచ్చే వరద వల్ల గ్రామంలోని చెరువులు కలుషితమవుతున్నాయని వారన్నారు. తక్షణమే కామంచికల్ డంపింగ్ యార్డ్‌ను మూసివేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా బలవంతంగా చెత్త తీసుకువచ్చి గ్రామాల్లో పోస్తాం అంటే తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటారని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నవీన్ రెడ్డి, సిపిఐ నాయకులు బోజెడ్ల సూర్యం, మాజీ సొసైటీ డైరెక్టర్ మేదర మెట్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ బొప్పి ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, తెలంగాణ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గుగులోతు కుమార్, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.