Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
- సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేశారని
- మండిపడ్డ బీసీ కమిషన్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణంలోని 16, 32 వార్డుల్లోని రైల్వే స్థలంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ప్రజల గృహాలను కూల్చివేసిన అంశంపై జాతీయ బీసీ కమిషన్ వైస్ ఛైర్మన్ డాక్టర్ లోకేష్ కుమార్ ప్రజాపతి, కమిషన్ సభ్యులు ఆచారి బుధవారం నిర్వాసిత ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ 15 రోజుల్లో నిర్వాసితులకు ఇంటి స్థలం కేటాయింపులు చేసి కమిషన్‌కు నివేదికలు అందచేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. నిర్వాసిత ప్రజలతో ముఖాముఖి నిర్వహణకు కొత్తగూడెం విచ్చేసిన ఆయన శ్రీనగర్ 4వ లైన్‌లోని చండీ సర్వజ్ఞ పీఠ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైస్ చైర్మ్న్కు, కమిషన్ సభ్యులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పుష్ప గుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. ఇండ్లు కూల్చి వేసిన సంఘటనను కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుందని, 15 రోజుల్లోగా నిర్వాసితులకు ఇంటి స్థలాలు పంపిణీ చేయకపోతే ఢిల్లీలో కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైల్వే అధికారులు అర్ధాంతరంగా అర్ధరాత్రి ఇండ్లు కూల్చివేయడం వల్ల పిల్లా పాపలతో, వయోవృద్ధులతో చాలా ఇబ్బంది పడ్డారని, ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఎందుకు కూల్చివేశారన్నారు. 60 ఏండ్ల క్రితం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న ప్రజలను అర్ధాంతరంగా ఖాళీ చేయించడం వల్ల ఎక్కడ నివాసం ఉంటారని రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రైల్వే శాఖకు కూడా సభ్యునిగా ఉన్నానని, డిజిని ఢిల్లీకి పిలిపించి ఈ అంశంపై మాట్లాడతానన్నారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు ఇచ్చే వరకు తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించాలని తహసిల్దార్‌ను ఆదేశించారు. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ బాదితులకు సమయం ఇవ్వకుండా అర్ధరాత్రి బుల్డోజర్లుతో ఇండ్లను కూల్చివేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి స్థలాలు మంజూరుచేస్తే ప్రధాన మంత్రి ఆవాజయోజన క్రింద ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. నిర్వాసితులకు స్థలం చూపించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కె.స్వర్ణలత, బిసి సంక్షేమ అధికారి సురేందర్, ఎస్సీ సహాయ ఎస్సీ సంక్షేమ అధికారి వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.