Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
హైదరాబాద్లో ఉన్న పురాతనమైన హెచ్ఎంటీ ఉత్పత్తి సంస్థ ఉద్యోగులను ఆదుకోవాలని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే జీని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎంపీలు, కుత్బాల్లాపూర్ ఎమ్మేల్యే బృందం బుధవారం రాత్రి కలిసింది. కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎంటీలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 6 దశాబ్ధాలుగా దేశ పారిశ్రామిక ప్రగతికి హెచ్ఎంటీ సంస్థ వెన్నుముకగా నిలిచిందన్నారు. దేశ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందడంలో గణనీయమైన పాత్రను సొంతం చేసుకుందన్నారు. రక్షణ, రైల్వేలు, ఆటోమొబైల్స్, ఏరో స్పేస్ రంగాలకు వస్తువులను ఉత్పత్తి చేయడంలో అగ్రభాగంలో నిలిచిందన్నారు. ఉత్పత్తి రంగంలో ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న హెచ్ఎంటీ సంస్థ నేడు అనుకున్న వ్యాపార లక్ష్యాలను చేరడంలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంస్ధ ఆర్ధిక నష్టాలను అధిగమించడం కోసం బెంగుళూరులోని హెచ్ఎంటీ లిమిటెడ్లో విలీనం చేయాలన్నారు. విలీన ప్రక్రియతో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. 2007 పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. నామ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి సమర్పించిన లేఖలో వివరించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు బండా ప్రకాష్, బీబీ పాటిల్, ఎమ్మెల్యే కెపి వివేకానందతో పాటు హెచ్ఎంటీ బెంగుళూరు, పింజూర్, అజ్మీర్, హైదరాబాద్ యూనిట్లకు చెందిన కార్మికులు ఆర్.మహేందర్, వై.బాలరాజు, సి.సత్యనారాయణ గౌడ్, డి.శ్రీశైలం, విమల్ పింజూర్ ఉన్నారు.
రూ.620కోట్ల సీఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయండి..
తెలంగాణ రాష్ట్రానికి 2021 సంవత్సరానికి సంబంధించిన సెంట్రల్ రోడ్డు ఫండ్స్(సీఆర్ఎఫ్) రూ.620 కోట్లను మంజూరు చేయాలని టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరధర్ అరమనే ను గురువారం ఎంపీ నామ నాగేశ్వరరావు కలిశారు. సీఆర్ఎఫ్ నిధుల విడుదల కోసం వినతి పత్రాన్ని అందించారు. 2021 సంవత్సరానికి ప్రతిపాదించిన సీఆర్ఎఫ్ రోడ్ల నిర్మాణ వివరాలను ఈ ఏడాది మార్చి నెలలో అందించామన్నారు. ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీని కలిసి విన్నవించటం జరిగిందన్నారు. ప్రస్తుతం సీఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తే టెండర్లు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. వర్షకాల సమయంలోనే టెండర్ల ప్రక్రియను ముగిస్తే ఆ తరువాత పనులను ప్రారంభించడానికి అనువుగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముందుగానే సీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయాలని మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎంపీ నామ విజ్ఞప్తి చేశారు.