Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
రాళ్ళు రప్పల్లో కూడా పెరిగే మొక్కలు ఉంటాయా అంటూ మండల అధికారులను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సున్నితంగా మందలించారు. బృహత్ పల్లె ప్రగతి స్థలం ఎంపికపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చిరునోముల గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతివనంలో కలెక్టర్ గురువారం మొక్కలు నాటారు. ఈ స్థలం మొత్తం ఎంత ఉందని తహశీల్దార్ రావూరి రాధిక, ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవిని కలెక్టర్ ప్రశ్నించారు. ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలమని వారు సమాధానం చెప్పారు. దీంతో పాటు మండలంలో మరో మంచి స్థలాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. మొక్కలు సజావుగా పెరిగే స్థలాన్ని ఎంపిక చేస్తారా, మొక్కలు పెరగని స్థలాన్ని ఎంపిక చేస్తారా అని వారిని ప్రశ్నించారు. మండలంలో ఎక్కడా ప్రభుత్వ స్థలం లేదని వారు సమాధానం చెప్పటంతో కలెక్టర్ వెంటనే మండలంలో ఎక్కడా ప్రభుత్వ భూమి ఒక్క ఎకరం కూడా లేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డిఆర్డిఓ పిడి మెరుగు విద్యా చందన, సర్పంచ్ ములకారపు రవిచ బోనకల్ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, పంచాయతీ కార్యదర్శి బంధం అర్జున్, ఇంచార్జి ఈజిఎస్ ఏపీఓ బెల్లం కొండ సతీష్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఆర్ఐలు గుగు లోతు లక్ష్మణ్ నాయక్, జి. సత్యనారాయణ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను సన్మానించిన సర్పంచ్
కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చిరునోముల గ్రామం వచ్చిన వి.పి గౌతమ్‌ను చిరునోముల సర్పంచ్ ములకారపు రవి, ఉపసర్పంచ్ ఆముదాల పుల్లారావు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గొల్లపల్లి నాగమల్లేశ్వరరావులు శాలువాలతో సన్మానించి, బొకేలు అందజేశారు.
కలెక్టర్‌కు సీపీఐ(ఎం) వినతి
చిరునోముల రోడ్డు అధ్వానంగా ఉందని, ఎన్ఎస్పీ కాలవపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడానికి సిద్ధంగా ఉందని కొత్త బ్రిడ్జి నిర్మించాలని, రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నిమ్మల రామారావు ఆధ్వర్యంలో కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సంగాపు నరసింహారావు తన భూమిలోకి తనను వెళ్లనివ్వకుండా దారులన్నీ మూసివేశారని, తన పొలాలన్నీ బీడు భూమిగా మారిపోయిందని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తాసిల్దార్ రావూరి రాధికని పిలిసి సమస్య పరిష్కారం చేయాలన్నారు.
ఎర్రుపాలెం : కోవిడ్ నియంత్రణకు ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకునేలాగా అవగాహన కల్పించాలని వ్యాక్సిన్ అందేలాగా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పివి గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మండలంలో కోవిడ్ తీవ్రతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోఉన్న సమస్యలను పరిష్కరించాలని డిఎంహెచ్ఓ మాలతితో మాట్లాడారు. మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకరరెడ్డి, బండారు నరసింహారావులు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డుకు కనెక్షన్ పాయింటు ఇప్పించాలని, భీమవరం నుండి గుంటుపల్లి గోపవరం వరకు మిగిలిపోయిన ఆర్అండ్బి రోడ్డును పూర్తిచేయాలని గ్రామ పంచాయతీలలో పంచాయతీ భవనాలను నిర్మించాలని కలెక్టర్‌కి వినతిపత్రం అందించారు. తొలుత పెద్ద గోపవరం గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేయనున్న మండల పల్లె ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జమలాపురం పంచాయతీ సర్పంచ్ మూల్పూరి స్వప్న, ఎర్రుపాలెం సొసైటీ అధ్యక్షుడు మూల్పూరి శ్రీనివాసరావులు జమలాపురం గ్రామపంచాయతీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని దరఖాస్తు అందజేశారు. కార్యక్రమంలో డిఎంఅండ్ హెచ్‌వో మాలతి, డాక్టర్ రాజు, సుధాకర్ నాయక్, మండల అధికారులు ఎంపీడీవో అశోక్ కుమార్, ఎంపీఈవో గంధం శ్రీలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్ కెఎంఏ అన్సారీ, ఎస్సై ఉదరు కిరణ్, జడ్పిటిసి శీలం కవిత, జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చావా రామకృష్ణ, గ్రామపంచాయతీ సర్పంచులు జంగా పుల్లారెడ్డి, ఇనుపనూరి శివాజీ, మొగిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
బృహత్ పల్లె ప్రకృతిస్థలంలో గుడిసెలు
బృహత్ పల్లె ప్రకృతివనం కోసం ఎంపిక చేసిన స్థలంలో కొంతమంది ఆ స్థలం తమదంటూ గుడిసెల వేశారని సర్పంచ్ రవి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. వెంటనే తాసిల్దార్ని పిలిపించి ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు.
మధిర : మధిరలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాలతిని స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధిర మున్సిపాలిటీ పనితీరుపై జిల్లా కలెక్టర్ పివి గౌతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధిరలో పర్యటించి మధిర మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషనర్ రమాదేవికి పలు సూచనలు చేశారు. మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడపై ఉన్న పిచ్చి రాతలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అడవిని తలపించే రీతిలో కంప పెరిగితే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయన వెంట తహసీల్దార్ సైదులు, చైర్పర్సన్ మొండితోక లత, ఎంపీడీవో కుడుముల విజయ భాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రావణ్ కుమార్, అనిల్ కుమార్ వెంకటేష్ పాల్గొన్నారు.
వైరా మున్సిపాలిటికి డంపింగ్ యార్డ్ ప్రభుత్వ భూమిని సేకరించాలని జిల్లా కలెక్టర్ గౌతం తహసీల్ధార్ రంగాకు సూచించారు. గురువారం కలెక్టర్ పర్యటనలో భాగంగా రిజర్వాయర్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రిజర్వాయర్‌పై నిర్మిస్తున్న మిని ట్యాక్‌బండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, కట్టపై మొక్కలు నాటాలన్నారు. అయన వెంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సూతకాని జైపాల్, సీతారాములు, కమిషనర్ వెంకటస్వామి, ఎంపిడిఓ వెంకటపతిరాజు తదితరులు ఉన్నారు.