Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల పరిషత్ సమావేశానికి హాజరు
- ప్రజా ప్రతినిధుల తరపున సమస్యలపై అధికారుల నిలదీత
- రొటీన్ కార్యక్రమంలో భాగమే : జెడ్పీ ఛైర్మన్ కోరం
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలో ఎంఎల్ఏ హరిప్రియ, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యలు తమతమ వర్గాలను పటిష్టపరుచుకునే క్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది. సింగరేణి అధికారులు ఏర్పాటు చేసిన మెగా హరితహారం కార్యక్రమానికి ఇద్దరిని ఆహ్వానించగా ఇరువురు పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ సమావేశం గురువారం ఎండిఓ అప్పారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎంఎల్ఏ హరిప్రియ హాజరవుతారని ముందే ప్రకటించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏఓ ప్రగతి నివేదిక చదువుచుండగా కోరం కనకయ్య హాజరయ్యారు. గ్రామీణ విత్తనోత్పత్తి, రైతు భీమా గురించి వివరించారు. ప్రభుత్వం రైతుకు అందిస్తున్న పథకాలు, మండలంలో వ్యవసాయం అభివృద్ది వివరించాలని జెడ్పి ఛైర్మన్ ఏఓకు సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈ ప్రగతి నివేదిక చదువుతుండగా తమ పంచాయతీలో పేరుకుపోయిన సమస్యలపై సర్పంచ్‌లు, ఎంపిటీసిలు నిలదీశారు. దీంతో సమాధానం చెప్పాలని జెడ్పి ఛైర్మన్ కోరం కనయ్య విద్యుత్ శాఖ ఏఇకి సూచించారు. వివరణ ఇస్తుండగానే ఎంఎల్ఏ హరిప్రియ, వైస్ ఎంపీపీ ప్రమోద్‌లు మండల పరిషత్ సమావేశ మందిరంనకు హాజరయ్యారు.
ఏఇ ప్రగతిని వివరిస్తుండగా వైస్ ఎంపిపి ప్రమోద్, సర్పంచ్‌లు సరోజ, కృష్ణ, ఎంపిటీసి అజ్మీర బిచ్చా మరి కొందరు ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యుత్ తీగలు ఇండ్ల మీదకు వస్తున్నాయని లూజ్‌గా ఉంటున్నాయని మధ్య పోల్స్ వేయడం లేదని, కొత్త మీటర్లు ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతన్నారని, త్రీ ఫేస్ విద్యుత్ ఉండటంలేదని, గ్రామాల్లో విద్యుత్ స్ధంభాలు వేయకపోవడంతో చీకటిగా ఉంటోందని, పల్లె ప్రగతికి ఏం పనులు చేశారని నిలదీశారు. దీంతో సమాధానం చెప్పాలని ఎంఎల్ఏ హరిప్రియ, జెడ్పి ఛైర్మన్లు ప్రజాప్రతినిధులకు బాసటగా నిలిచారు. ఏఇ సమాధానం ఇచ్చినప్పటికి సంతృప్తి చెందలేదు. అనంతరం అటవీ శాఖ రేంజర్ రవి కిరణ్ నివేదిక చదువుతుండగా పీఏసీఎస్ ఛైర్మన్ మెట్ల కృష్ణ, బొజ్జాయిగూడెం సర్పంచ్ చీమల వెంకటేశ్వర్లు, ఎంపీటీసి బిచ్చాలు పోడు సమస్యలపై నిదీశారు.
దీంతో ఎంఎల్ఏ హరిప్రియ మాట్లాడుతూ నా వద్దకు కూడా ఫిర్యాదులు వచ్చాయి. పట్టాలు ఉన్నప్పటికీ మొక్కలు నాటారు. రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు. అనంతరం రైతులు,ప్రజా ప్రతినిధులు ఇచ్చే ఫిర్యాదులు తీసుకుని సమస్య పరిష్కరించాలని సూచించారు.
మరో యేడాదిలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతుండటంతో అధిస్టానం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సారి ఎంఎల్ఏ టికెట్ కోసం కోరం కనకయ్య అప్పుడే ప్రయత్నాలు తెలుస్తోంది. ఈసారి ఇల్లందు టికెట్ కోసం ఇరువురి మధ్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే హరిప్రియ పట్ల కినుక వహించినట్లు తెలుస్తోంది. వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నంలో భాగంగా జడ్పీ చైర్మన్ మండల పరిషత్ సమావేశానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.