Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''గ్రీవెన్స్ డే''లో అందిన ప్రతి దరఖాస్తుకూ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ''గ్రీవెన్స్ డే''లో పలు సమస్యలపై అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఖమ్మం నగరానికి చెందిన శెట్టి ఉజ్వల తన భర్త జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంప్యూటర్ డెటా ఆపరేటర్ గా పనిచేస్తూ కిడ్ని వ్యాధితో మరణించారని, కారుణ్య నియామకం ద్వారా తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
రఘునాథపాలెం మండలంకు చెందిన సహదేవ్ తనకు యాక్సిడెంట్లో రెండు కాళ్లూ పోయినందున ట్రై సైకిల్, పింఛన్ ఇవ్వాల్సిందిగా కోరారు. కస్తూర్భాగాంధీ బాలికల వసతి గహములో స్వీపర్ ఉద్యోగం ఇప్పించాలని కూసుమంచి మండలం గడ్డమీదతండాకు చెందిన బి.లాలి కోరారు. బోటిమీద తండాకు చెందిన డి. సీతారాములు తనకు ఇంటి స్థలం ఇప్పించాలని దరఖాస్తు చేశారు. కోయచెలక గ్రామంలో సర్వేనెం. 213/2 లో 20 కుంటల భూమికి తన పేరున పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన పోతనబోయిన రమేష్ కోరారు. తన కుమారుడు పాస్ బుక్‌ను బలవంతంగా లాక్కున్నాడని తల్లాడ మండలం వెంకటగిరి గ్రామంకు చెందిన దీవెల భద్రయ్య మొరపెట్టుకున్నారు. నేలకొండపల్లి మండలం కోరుట్ల గూడెం సర్వేనెం.350లో 16 ఎకరాల భూమిని వ్యవసాయ ఆస్తిగా నమోదు చేయాల్సిందిగా ఓ వ్యక్తి కోరారు. దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ స్థలాలు గుర్తించాలి...
జిల్లాలో ప్రయివేటు భవనాలలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ వసతి గహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పౌర సరఫరాల గిడ్డంగుల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారిణి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.