Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట ప్రకారమే పార్క్‌కు భూమి సేకరణ
- పోడు లాక్కొంటే ఆత్మహత్యే శరణ్యం-బాధిత కుటుంబం
నవతెలంగాణ-కారేపల్లి
మెగా పార్క్ పేరుతో ఆదివాసీ కుటుంబం ఆధీనంలో ఉన్న పోడు భూమి లాక్కొని అన్యాయం చేయవద్దని, పేదలైన ఆదివాసీ కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘం, సీపీఐ(ఎం) నాయకులు అధికారులను కోరారు. సోమవారం కారేపల్లి తహసీల్ధార్ కార్యాలయంలో తహసీల్ధార్ డీ.పుల్లయ్య, ఎంపీడీలో మాచర్ల రమాదేవి, ఎస్సై పీ.సురేష్‌లు మెగాపార్క్ బాధిత అదివాసీ కుటుంబం, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర నాయకులతో సమావేశమైనారు. మండలంలోని పాటిమీదిగుంపు గ్రామపంచాయతీ పరిధిలోని పోడు భూమిలో అధికారులు మెగా పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులు ప్రారంభించగా ఆ పోడు భూమి మాదంటూ చీమలపాడుకు చెందిన బచ్చల పొట్టెయ్య కుటుంబం అభ్యంతరం తెలిపారు. హక్కులున్న మా పోడుజోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
తమకు 9.16 ఎకరాలకు అటవీ హక్కుల చట్టం ప్రకారం క్లెయిమ్ నెం. 222017010010005 ద్వారా ప్రభుత్వం హక్కు కల్పించిందని, దానిలో 4.25 సాగు చేస్తుండగా మిగతాది పశువుల మేపటానికి ఉంచుకున్నట్లు బాధితులు, గిరిజన సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆ పోడుపై ఆధారపడి నాల్గు ఆదివాసి కుటుంబాలు జీవిస్తున్నాయని మానవతదృక్పధంతో ఆలోచించాలని వారు అధికారులను కోరారు. మెగా పార్క్‌కు సేకరిస్తున్న భూమికి సరిపోను ఇతర ప్రాంతంలో సాగు భూమి ఇస్తే అభ్యంతరం లేదని నాయకులు తెలిపారు. చట్టబద్ద ప్రకారమే మెగా పార్కుకు భూమిని గుర్తించామని, బాధిత కుటుంబానికి రీ సర్వే ప్రకారం 4.25 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. త్రీ మ్యాన్ కమిటీ రీ సర్వే ఆధారంగా నిర్ణయించి భూమికి మాత్రమే బాధిత కుటుంబానికి రైతు బంధు ప్రభుత్వం ఇస్తుందన్నారు. మిగతా భూమిపై వారి హక్కు లేదన్నారు. దీంతో బాధితు కుటుంబానికి చెందిన బచ్చలి కోటేశ్వరరావు, స్వర్ణ, మంగమ్మలు భూమి దగ్గరకు వస్తే పురుగుమందు త్రాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రీ సర్వే విషయం తమకు తెలియదని మా పోడు గుట్టసమీపంలో లేదని రోడ్డు పక్క ఉందని దానిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీంతో అధికారులకు బాధితులకు మధ్య చర్చలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు తమ భూమిలో మెగా పార్క్ పనులను అడ్డుకుంటామని బాధితు కుటుంబికులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నాయకుల మద్దెల నాగయ్య, ఎరిపోతు భద్రయ్య, మాలోత్ రాంకోటి, కొండం వెంకటేశ్వర్లు, కల్తి భధ్రయ్య, జటోత్ హరికిషన్, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.