Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కమ్మ హాస్టల్...ఇది కమ్మ కులస్తుల కోసం ఉద్దేశించబడినదే కావచ్చు. కానీ ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకూ చోటు ఉంది. ప్రతిభా ప్రామాణికంగా ఇక్కడ ఆయా విద్యార్థినులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ వసతిగృహానికి ఓ ప్రత్యేక స్థానముంది. స్వాతంత్య్రానికి పూర్వం 1931లో నైజాం కాలంలో దీన్ని నెలకొల్పారు. అప్పట్లో విద్యలో వెనుకబడిన కమ్మ కులస్తుల కోసం ఓ హాస్టల్ నిర్మించాల్సిన అవసరం ఉందని రావెళ్ల శంకరయ్య, శాఖమూరి వీరరాఘవయ్య భావించారు. పండిత శంకరయ్య, పైడిపల్లి హనుమయ్యచౌదరి, చావ బుచ్చయ్య కలిసి ఈ విషయమై కొమ్మినేని రోశయ్యచౌదరితో చర్చించారు. రోశయ్య, శంకరయ్య, మానుకొండ వెంకట బుచ్చయ్య, చావా వెంకటకోటయ్య, బండి రామయ్య, వెంకయ్య, తాతా సత్యనారాయణ, సీతారామయ్య, రావెళ్ల నాగయ్య, శాఖమూరి సత్యనారాయణ, వెంకయ్య తది తరులు చందాలు వేసుకున్నారు. విప్పర్ల వెంకటప్పయ్య వర్మ మూడు ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలో నైజాం అధికారులు అనేక అవరోధాలు సృష్టించినా అధిగమించి చివరకు కమ్మ వసతిగృహ నిర్మాణం పూర్తయింది.
ఖమ్మానికే తలమానికం...
అప్పట్లో శివారున ఉన్న కమ్మ హాస్టల్ పట్టణ విస్తరణతో పట్టణ నడిబడ్డున అయింది. పాతబస్టాండ్ మార్గంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి పక్కన సువిశాల ప్రాంగణంలో డంగు సున్నంతో నిర్మించిన ఈ హాస్టల్ కట్టడం ఖమ్మానికే తలమానికంగా ఉండేది. అప్పట్లో ఈ హాస్టల్ నిర్వహణ కోసం నెలకు ఒక విద్యార్థికి రూ.7 చొప్పున వసూలు చేసేవారు. పదేళ్లు మొదలు 19 ఏళ్ల వయసు వరకు విద్యార్థులు ఇక్కడ ఉండి విద్యనభ్యసించేవారు. క్రమశిక్షణ, అంకితభావంతో చదువుకున్న ఎందరో ఈ హాస్టల్ విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఈ హాస్టల్లోనే చదువుకుని కలెక్టర్‌గా రిటైర్డ్ అయిన మోత్కూరి వెంకటప్పయ్య ప్రత్యేక కృషితో ఈ వసతిగృహానికి ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, కాటంనేని రమేష్‌లు ఈ హాస్టల్ వృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.
నాడు బాలుర హాస్టల్...నేడు బాలికలకే...
విద్యా వసతులు అతితక్కువగా ఉన్న ఆరోజుల్లో వసతి కల్పనతో విద్యాభివృద్ధి జరుగుతుందనే భావనతో బాలుర హాస్టల్ నెలకొల్పారు. ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులు అబ్బాయిలను కిందామీదా పడి చదివిస్తున్నారు. బడి మాన్పించాల్సి వస్తే కచ్చితంగా కూతురు విద్యకే ఫుల్స్టాప్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ మహాజన సంఘం బాలికా విద్య ప్రాధాన్యాన్ని గుర్తించింది. నూతనంగా నిర్మించిన హాస్టల్‌ను కేవలం బాలికలకే పరిమితం చేసింది. కార్పొరేట్ హంగులతో రూ.2.25 కోట్ల వ్యయంతో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. ఈ హాస్టల్లో సుమారు 200 నుంచి 250 మందికి వసతి సామర్థ్యం ఉంది. దీని నిర్మాణానికి అయిన వ్యయంలో రూ.60 లక్షలు దాతలు విరాళంగా ఇచ్చారు. దీనిలో పది లక్షలు ఇచ్చిన ఇద్దరు, రూ.5 లక్షలు ఇచ్చిన ఆరుగురి పేర్లను ఆయా గదులకు నామకరణం చేశారు. 28 గదుల ఈ భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్రంథాలయం, డైనింగ్‌హాల్, కిచెన్ తదితర సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుతం బాలికలకు వసతి కల్పిస్తున్న నేపథ్యంలో అత్యంత బందోబస్తుగా ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌కు ముందు గదికి ఆరేడుగురు ఉండేవారు.. ఇప్పుడు ఇద్దరు, ముగ్గురికే పరిమితం చేశారు. ప్రస్తుతం వసతిగృహంలో 90 మంది వరకు ఉన్నారు. దండ్యాల లక్ష్మణరావు హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. కులాలకు అతీతంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థినులకు నిబంధనలకు లోబడి ప్రవేశం కల్పిస్తున్నారు.
ప్రవేశాలు ఇలా...
ఈ హాస్టల్లో ప్రవేశానికి కొన్ని నిబంధనలున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రతిభ కలిగిన పేద, మధ్యతరగతి విద్యార్థినులకు అధికశాతం సీట్లు ఇస్తున్నారు. ఇతర వర్గాల్లోని వారికీ ఇదే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిభ, ప్రవర్తన ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఎలాంటి రుసుం చెల్లించకుండానే హాస్టల్లో ప్రవేశం పొందవచ్చు. రూ.15వేలు చెల్లించిన వారికి సేవా సంస్థల ద్వారా రూ.40వేల విలువ చేసే ల్యాప్‌టాప్‌లు సమకూర్చుతున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ మొదలు ఆపై కోర్సులు చదివే విద్యార్థినులు ఇక్కడ చేరవచ్చు. నగరంలోని పలు విద్యాసంస్థల బస్సులు హాస్టల్ వద్దకు వచ్చేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇంటిని మరిపించేలా వసతులు
తూము రమ్య, బీఎస్సీ(ఫైనల్), చండ్రుగొండ, భద్రాద్రి జిల్లా
ఇక్కడి హాస్టల్లో ఇంటిని మరిపించేలా వసతులున్నాయి. ప్రతి రోజు ఉదయాన్నే రోజుకో టిఫిన్, మధ్యాహ్నం లంచ్, గురువారం ఎగ్, ఆదివారం చికెన్, రోజు రెండు మూడు రకాల కూరలతో భోజనం. శుచీశుభ్రతతో కూడిన వసతి ఇంతకన్నా ఏమి కావాలి? ఇంటికి ఏమాత్రం తీసిపోని వసతి ఉచితంగా లభిస్తుండటం గొప్ప విషయం.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు బుక్స్
పావులూరి చందన, బీఎడ్, బలపాల, మహబూబాబాద్ జిల్లా
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కావాల్సిన బుక్స్ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. సమష్టిగా ఉపయోగిం చుకునేందుకు ఐదారు ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఎవరైనా వ్యక్తిగతంగా ల్యాప్టాప్స్ కావాలంటే రూ.15వేలు చెల్లిస్తే మిగతా మొత్తం నిర్వాహకులు భరించి సమకూర్చుతారు. కోర్సుకు సంబంధించి ఏవైనా పుస్తకాలు కావాలన్నా పైసా తీసుకోకుండా తెచ్చి ఇస్తారు. స్టడీ అవర్స్, స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్‌ల వంటివి నిర్వహిస్తారు.
బాలికా విద్యపై నిర్లక్ష్యాన్ని తొలగించాలనే...
- వేజెళ్ల సురేశ్, అధ్యక్షుడు, కమ్మ మహాజన సంఘం, ఖమ్మం
ఒకప్పుడు బాలురకు వసతి కల్పించిన హాస్టల్లో బాలికా విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి వారికే వసతి కల్పిస్తున్నాం. బాలికలకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంచాం. స్వర్ణభారతి కల్యాణ మండపం నుంచి వస్తున్న ఆదాయాన్ని హాస్టల్ నిర్వహణకు వెచ్చిస్తున్నాం. కొంత దాతల నుంచి సమకూర్చుతున్నాం. ఎన్ఆర్ఐ, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొంత విద్యార్థినులు చెల్లిస్తే మిగిలిన మొత్తం వేసి ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నాం. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.