Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు సర్పంచ్ లక్ష్మణ్ కుర్చీల వితరణ
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాజకీయంలో (సీటు) కుర్చీ విలువ కుర్చీ (సీటు)దే. అందుకేనేమో...నోటు ఎంత పెద్దదైనా వెచ్చిస్తారు మన అధినాయకులు. కానీ ఈ కుర్చీ కథ వేరు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఓ పాఠశాలకు వెళ్ళిన సర్పంచ్‌కు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు తను లేచి ఆ కుర్చీలోనే కూర్చోమన్నాడు. అక్కడ ఒక్క కుర్చీ మాత్రమే ఉండటం గమనించిన సదరు సర్పంచ్ గురువు గారి కుర్చీ కాబట్టి ఆ కుర్చీ గౌరవంతో తాను వెళ్ళిన పని చూసుకొని వచ్చారు. ఇది మనస్సులో పెట్టుకున్న సర్పంచ్ ఏదో ఒక మంచి సందర్భంలో తన పంచాయతీ పరిధిలోని అంగన్ వాడీ, ప్రాధమిక పాఠశాలలకు కుర్చీలు బహుకరించాలని తీర్మానం చేసుకున్నాడు. పనిలో పనిగా ఆగస్టు 15 జాతీయ పండుగ రోజు ఆ శుభకార్యం చేసేసారు.
మండల పరిధిలోని కన్నాయిగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణ్ రావు గారి మాటల్లోనే... ''ఓ సారి పంచాయతీలోని ఆవాస గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను, అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించాను. అందులో ఒక స్కూల్లో ఒక కుర్చీ మాత్రమే ఉంది. అది కూడా సగం విరిగిపోయిన కుర్చీ మాత్రమే! నేను వెళ్ళగానే సదరు ఉపాధ్యాయులు లేచి నిలబడి కూర్చోండి అని నిలబడిపోయారు. చదువులు చెప్పే గురువుల కుర్చీ కాబట్టి నేను కూర్చో లేదు. అక్కడి సమస్యలు తెలుసుకొని వచ్చి ఆలోచనలో పడ్డాను. స్కూళ్లలో కనీసం కుర్చీ కూడా లేని ఇలాంటి పరిస్థితి ఉండకూడదని. దీంతో మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు కదా అని కన్నాయిగూడెం, కొత్త కన్నాయి గూడెం, చెన్నాపురం, గోపన్నగూడెం అంగన్వాడీ కేంద్రాలకు, ప్రాధమిక పాఠశాలకు ఒక్కో దానికి రెండు కుర్చీలు చొప్పున మొత్తం 14 కుర్చీలను రూ.5000లు వెచ్చించి ఆయా ఉపాధ్యాయులకు వితరణగా అందజేసినట్టు తెలిపారు. దీంతో శహబాస్ సర్పంచ్ గారంటూ వారు కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు.