Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోనకల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బోనకల్ మండలంలో గత మూడు రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో మండలంలోని రహదారులు, వాగులు, పంట పొలాలు నీట మునిగాయి. మండల పరిధిలోని పెద్ద బీరవల్లి, జానకిపురం గ్రామాలలోని వరి నారు మల్లు, వరి పంటలు నీట మునిగాయి. కలకోట గ్రామం ముందు గల వాగు పూర్తిగా మునిగిపోయింది. వాగుపైన 4,5 మీటర్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. పెద్దబీరవల్లి - మధిర క్రాస్ రోడ్డు రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మండలంలోని అనేక గ్రామాలలో పత్తి పొలాలు కూడా నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి నిల్వ ఉంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆళ్లపాడు వాగు కూడా వర్షపు నీటిలో మునిగి పోయింది. పత్తి పంట ఎంతో ఆశాజనకంగా ఉందని అన్నదాతలు ఆనంద పడుతున్న సమయంలో వారి ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
కల్లూరు : మండల పరిధిలోని తాళ్ళూరు ఉర చెరవు అలుగు పడి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో తాళ్ళూరు నుండి వెంకటాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో పాటు సోమవారం రాత్రి భారీ వర్షం పడటంతో చెరువు అలుగు సుమారు 5 అడుగుల ఎత్తున ప్రవహిస్తూంది. రాత్రి వరకు ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో వాగు వెంట ఉన్న పత్తి, వరి నీటమునిగింది.
ముదిగొండ: మండలంలో గత రెండు రోజుల నుంచి తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు పూర్తిస్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. నాటు వేసిన పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. పత్తి చేలల్లో వర్షపు నీరు చేరినాయి. అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. చిరుమర్రి తాళ్లవాగుకు వర్షపునీరు వరదలా వచ్చి ఆర్అండ్బీ రహదారిపై నుండి పొంగి పొర్లుతూ ఉధృతంగా ప్రవహిసోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.