Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
బ్లాక్ ఫంగస్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్ల పాలెం గ్రామంలో మంగ ళవారం చోటుచేసుకుంది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ సభ్యుడు చామర్తి కోటయ్య(65) ఈ ఏడాది జూన్ నెలలో కరోనా సోకింది. కరోనా వ్యాధి తగ్గక ముందే కంటికి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకింది. దీంతో బంధువులు హైదరాబాద్ లోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కొద్దిరోజుల క్రితమే ఆస్పత్రి నుంచి చొప్పకట్లపాలెం వచ్చాడు. ఆరోగ్యవంతంగానే ఉన్నట్లు కనిపించాడు. కానీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు కోటయ్య చొప్పకట్లపాలెం గ్రామంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాలలో కోటయ్య పాల్గొన్నారు. మృతదేహాన్ని పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి పల్లా కొండల రావు, శాఖా కార్యదర్శులు చలమల అజరు కుమార్, బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు కిలారి సురేష్, నాయకులు కొండేటి అప్పారావు, ఉన్నం వెంకటేశ్వర్లు, రచ్చ శివ, చలమల హరికృష్ణ రావు నివాళ్లు అర్పించారు.