Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం గూఢచర్యం పేరుతో 'నీ ఫోన్‌తోనే నీపై నిఘా' పెడుతూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను సైతం హరిస్తోందని 'ప్రజాస్వామ్యానికి పెనుముప్పు 'పెగసస్'' పుస్తకావిష్కరణ సభలో వక్తలు పేర్కొన్నారు. ఖమ్మంలోని 'నవతెలంగాణ' బుకహేౌస్‌లో సంస్థ జనరల్ మేనేజర్ ఎం.సుబ్బారావు అధ్యక్షతన రాజకీయ, సాహితీ ప్రముఖులు మంగళవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పార్లమెంట్‌ను, దేశాన్ని పెగసస్ స్పైవేర్ కుంభకోణం అతలాకుతలం చేస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కర్నీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని, బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి పాల్పడే ఫోన్ల హ్యాకింగ్ ఇది అన్నారు. దేశభద్రతకు వాడే స్పైవేర్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. టెర్రరిజం, హింసాకాండకు పాల్పడే అవకాశమున్న సమయంలో అనుసరించే ఫోన్ల ట్యాపింగ్‌ను స్వీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదని కవి, కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం పేర్కొన్నారు. ఎటువంటి ఎమర్జెన్సీ విధించకుండానే ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి, నియంతృత్వానికి దారితీసే ఈ పెగసస్ స్పైవేర్ ప్రయోగం ఎంతటి ప్రమాదకరమైనదో ఈ పుస్తకంలో వివరించారని రచయిత, కవి, సాహితీవేత్త ఆనందాచారి పేర్కొన్నారు. ఈ గదిలో మనం ఏమి చేస్తున్నామో కూడా పెగసస్ స్పైవేర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సుప్రీంకోర్టు సైతం దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోందని కవి, రచయిత, జర్నలిస్టు ప్రసేన్ అన్నారు. కనీసం ఎందుకు ఉపయోగించారో కోర్టుకు కూడా సమాధానం చెప్పకపోవడంలో కేంద్రం వైఖరీపై విమర్శలు వస్తున్నాయన్నారు. మనకు తెలియకుండా మన బాత్రూంలో కెమెరాలు పెట్టడం లాంటిదే 'పెగసస్' కుంభకోణమని రచయిత కట్టా శ్రీనివాస్ విమర్శించారు. ప్రకాశ్కరత్, అరుంధతీరారు, సీమాచిష్టీ, ప్రబీర్ పుర్కాయస్థ, వైభవ్ నికమ్, సిద్ధార్థ వరదరాజన్ వంటి ప్రముఖుల వ్యాసాలతో కూడిన ఈ పుస్తకాన్ని ప్రచురించిన 'నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్'ను వక్తలు అభినందించారు. కేవలం రూ.20కే 'పెగసస్' కుంభకోణంపై సమగ్ర విశ్లేషణలతో లభిస్తున్న ఈ బుక్లేట్ను ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా కోరారు. ఖమ్మంలోని నవతెలంగాణ బుకహేౌస్తో పాటు ఐటీ హబ్ వద్ద ఉన్న నవతెలంగాణ సంచార పుస్తక ప్రదర్శనశాలలో పుస్తకం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, ప్రముఖ రచయిత సునంద, నవతెలంగాణ ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి కె.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది వరలక్ష్మి, వీరారెడ్డి, శివారెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.