Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
రాష్ట్రంలో అర్హులందరికీ దళితబంధు వర్తింపజేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, డిహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు మంద వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మంచికంటి మీటింగ్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అర్హులందరికీ దళిత బంధు వర్తింపజేయాలని, కూలీలందరికీ కూలి బంధు, కూలి బీమా పథకం తేవాలన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం మోసపూరిత పథకంగా మిగలకూడదన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని, పోడు సాగుదారులకు అందరికీ హక్కు పత్రాలు ఇచ్చి న్యాయం చేస్తానని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని, కాంట్రాక్టు లేబర్ని పర్మినెంట్ ఉద్యోగాలు మారుస్తానని గతంలో ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగా మిగిలాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులు, గిరిజనులు, పేదల అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించి సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా సహకరించాలని వారు డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెబుతున్న ముఖ్యమంత్రి అనేక పథకాలకు డబ్బుల్లేక అమలు లేక పేదలకు సంక్షేమ పథకాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది పెద్దలకు దోచిపెట్టే పథకాలను ప్రాజెక్టులను కట్టడం ద్వారా రాష్ట్ర బడ్జెట్‌ను వృథా చేస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా ఈ దళిత పథకం దళితులను మోసం చేసే పథకంగా ఉండకూడదని వారు కేసీఆర్‌కి హితవు పలికారు. ఈ నెల 19, 20 తేదీల్లో మండల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని, నెలాఖరు వరకు గ్రామస్థాయిలో సమావేశాలు జరిపి దళితులను, కూలీలను ఐక్యం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించిందన్నారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు బారీ మల్సూర్, పి.సంగయ్య, బందెల వెంకయ్య, వి.నాగేశ్వరరావు, బంధం శ్రీను, మత్స్య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పగడాల నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూక్య కృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు మాచర్ల గోపాల్, కెవిపిఎస్ జిల్లా నాయకులు విద్యాసాగర్, యుటిఎఫ్ జిల్లా నాయకులు కె రమేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీనివాస్, జిల్లా ఎకడమిక్ సెల్ కన్వీనర్ బండారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.