Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
రుణం ఇచ్చే ముందు వడ్డీ లేదన్నారు. తీరా రుణం తీసుకున్నాక వడ్డీ కట్టాలంటున్నారు. పోనీ ఆ వేసే వడ్డీల తీరు చూస్తే తీసుకున్నాళ్లకే కాదు విన్న వారు కూడా నోర్లు వెళ్లబెట్టేలా ఉంది. పూర్తిగా కట్టిన గ్రూపులకు బ్యాంకు వారు తాఖీదులు పంపిస్తుండటంతో రుణ గ్రహీతలు ఆందోళన చెందుతున్నారు. ఇది సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకులో జరుగుతున్న వైనమిది. వివరాల్లోకి వెళ్తే సత్తుపల్లి మండలం తాళ్లమడ ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 15 గ్రూపులకు సత్తుపల్లి డీసీసీబీ వారు జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్జీ) పథకం కింద 2015లో ఒక్కో గ్రూపుకు రూ. 50వేల చొప్పున రుణాలు అందజేశారు. ఒక్కో గ్రూపును ఐదుగురు సభ్యులు ఏర్పాటు చేసుకుని బ్యాంకు వారు ఇచ్చిన రూ. 50వేలను తలా రూ. 10వేలు తీసుకోవడం జరిగింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పేద వర్గాలకు చెందిన రుణగ్రహీతలు రుణం తీసుకున్న నాటినుంచి తమ బాధ్యతగా ఎంతో కొంత చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే పూర్తిగా చెల్లించినా బ్యాంకు నుంచి వేలకు వేలు కట్టాలంటూ తాఖీదులు రావడంతో ఆందోళన చెందుతున్నారు.
ఉదాహరణకు తిరుమల గ్రూపుకు చెందిన సభ్యులు తమకిచ్చిన రుణం రూ. 50వేలకు గాను రూ. 52,400 వరకు బ్యాంకుకు జమచేశారు. ఇంకను రూ. 34,097 వేలు కట్టాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు పంపించారు. ఇదే లెక్కన శ్రీగణేశ్ గ్రూపు రూ. 42వేలు జమ చేయగా ఇంకను 39,700 కట్టమని నోటీసులు వచ్చాయి. శ్రీరామ గ్రూపుకు రూ. 29,550 కట్టగా రూ. 56,148, నరేశ్ గ్రూపు రూ. 29.500 జమచేయగా ఇంకను 56,864, ఈ విధంగా గ్రామంలో రుణాలు తీసుకున్న అన్ని గ్రూపులకు బ్యాంకు నుంచి ఇదే రకమైన నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు. అధిక వడ్డీల విషయమై డీసీసీబీ బ్యాంకు అధికారులను రుణ గ్రహీతలు అడుగ్గా కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత యేడాది మండలంలోని సిద్దారంలో కూడా ఇదే రకమైన వడ్డీలను వేస్తే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బ్యాంకు ముందు ఆందోళన చేయడంతో పాటు బ్యాంకు అధికారులను కలిసి పరిస్థితిని వివరించిన నేపధ్యంలో వడ్డీలను సవరించి రుణ గ్రహీతలకు వెసులుబాటు కల్పించారు. ఇదే విధంగా తాళ్లమడ జేఎల్జీ గ్రూపులకు కూడా డీసీసీబీ వారు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.