Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రహదారుల నిర్మాణంలో నాణ్యత, సాంకేతికత వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మనగలిగే రహదారుల నిర్మాణంపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఆలోచన చేయాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మనగలిగే రహదారుల నిర్మాణంపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. బుధవారం డిఆర్డీఏ సమావేశపు హాల్లో గ్రామీణ రహదారులపై నిర్వహించిన అవగాహనా సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లును ఉద్దేశించి మాట్లాడుతూ మారుమూల గ్రామాలున్న మన జిల్లాలో ప్రతి ఆవాసానికి రహదారి సౌకర్యం కలిగి ఉన్నామని చెప్పారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కడ ఎటువంటి రోడ్లు వేయాలి. ఎక్కడ వేస్తే బావుంటదనే అంశంలో సాంకేతికతను వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామ సడక్ యోజన పథకం క్రింద రూ.113 కోట్లతో చేపట్టిన 86 రోడ్డు పనులు 3 వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. కేంద్ర హౌం శాఖ మన జిల్లాలోని నాలుగు మండలాలైన పాల్వంచ, చర్ల, దుమ్ముగూడెం, గుండాలను సమస్యాత్మక, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి, 100 అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రతి ఆవాసానికి రహదారి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకానికి 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేస్తున్నదని, మిగిలిపోయిన 14 వంతెనల ననులకు రూ.24.73 కోట్లు మంజూరు కాగా 11 పనులు పూర్తి కాగా ఒక పని పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. రూ.92.97 కోట్లతో 54 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పనకు చేపట్టిన 44 పనులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో దమ్మపేట జడ్పీటిసి పైడి వెంకటేశ్వరావు, పంచాయతీరాజ్ ఈఈలు సుధాకర్, మంగ్యా, డిఇలు సత్యనారాయణ, రామకృష్ణ,ఏఇలు తదితరులు పాల్గొన్నారు.