Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
కోవిడ్ కారణంగా 2020 మార్చి నుండి (గత రెండు విద్యాసంవత్సరాల్లో) పాఠశాలలు నడవటమే లేదు. విద్యార్థుల నమోదు పూర్తి స్థాయిలో జరగనేలేదు. సంక్షేమ హాస్టళ్ళు తెరవక పోవటంతో అనుబంధ పాఠశాలల్లో అడ్మిషన్లు లేనే లేవు. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయుల క్యాడర్ విభజన ఓ కొలిక్కి రానేలేదు. ఇంతటి అస్తవ్యస్త పరిస్థితుల్లో హడావుడిగా ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్(హేతుబద్దీకరణ) చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఏమొచ్చిందో అంతుచిక్కడం లేదని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల అధ్యక్షుడు కంభం రమేష్ విస్మయం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంతర్జిల్లా బదిలీలు, సాధారణ బదిలీలు, పదోన్నతులు పాత జిల్లాల ప్రకారం చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినా షెడ్యూల్ విడుదల చేయకుండా నాలుగు నెలలపాటు తాత్సారం చేసిన విద్యాశాఖ రేషనలైజేషన్ పట్ల ఇంత శ్రద్ధ చూపడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2020 - 21 యుడైస్ గణాంకాలు ఇంకా ఫైనల్ కానేలేదన్నారు. మరి వాటి ఆధారంగా రేషనలైజేషన్ ఎలా చేస్తొరో అర్థం కావడం లేదన్నారు. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన పూర్తి స్థాయిలో ప్రారంభమై, విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత తాజా గణాంకాల ఆధారంగా మాత్రమే రేషనలైజేషన్ గురించి ఆలోచించాలని అప్పటివరకు రేషనలైజేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. 12-8-21 నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని హేతుబద్ధీకరణ చేస్తే ఫలితంగా బోనకల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల లైనా ఆళ్ళపాడు, గోవిందాపురం ఏ, రావినూతల ఎస్ టి, రాపల్లి హరిజనవాడ, బోనకల్ స్టేషన్ , గోవిందాపురం ఎల్, పిఎస్ రామాపురం, పిఎస్ చిరునోముల, పిఎస్ సీతానగరం, పిఎస్ పెద్ద బీరవల్లి, కలకోట హరిజనవాడ, పిఎస్ బోనకల్లు రెండు పోస్టులు, గతంలో ఆరు పాఠశాలలకు శాంక్షన్ అయిన 6 ఎల్ఎఫ్ఎల్ హెచ్ ఎం పోస్టులు పూర్తిగా కనుమరుగు అవుతాయన్నారు. విద్యార్థుల నమోదు జరుగుతున్న ఈ సమయంలో హేతుబద్ధీకరణ చేయడం సహేతుకం కాదని, నమోదు పూర్తయిన తర్వాత హేతుబద్ధీకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో ఆ సంఘం మండల ఉపాధ్యక్షురాలు పి.సుశీల, మండల ఉపాధ్యక్షులు ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, మండల కోశాధికారి ఏ పుల్లారావు పాల్గొన్నారు.