Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-15 రోజుల పాటు నిర్వహించాలి
- కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో డెంగ్యూ నియంత్రణ చర్యలకు గురువారం నుంచి 15 రోజుల పాటు ''డ్రై డే'', జ్వరసర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రజ్ఞా సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతి పి.హెచ్. సిలో ర్యాపిడ్ టెస్టులు, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నేటి నుంచి 15 రోజుల పాటు ''డ్రై డే'' నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి డేటాను, రోగనిర్ధారణకై పరీక్షలు నిర్వహించిన డయాగస్టిక్ సెంటర్ల నుండి డేటాను సేకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ ఎలిసా టెస్ట్ కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే నిర్వహించాలన్నారు. ప్రయివేటు ఆసుపత్రులు, డయాగస్టిక్ కేంద్రాలు ఎలిసా నిర్ధారణ చేయవద్దని తెలిపారు. గ్రామాలలో ఆర్.ఎం.పి వైద్యులు పేషెంట్లకు స్టెరాయిడ్స్ ఇవ్వకుండా పి.హెచ్.సిల మెడికల్ ఆఫీసర్లు ఆర్.ఎం.పిలతో సమావేశం కావాలన్నారు.
కోవిడ్-19 నియంత్రణకు జిల్లాలో చేపట్టిన కట్టడి చర్యల మాదిరిగానే డెంగ్యూ నియంత్రణ చర్యలు పకడ్బందీగా ఉండాలన్నారు. పట్టణాలు, గ్రామాలలో కళాజాతల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నియంత్రణ ముందస్తు చర్యలను తెలిపే ప్లె˜క్సీలను ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని, నగరంలో స్వచ్ఛ ఆటోల ద్వారా డెంగ్యూ నియంత్రణ, ముందస్తు చర్యల పట్ల విస్తత ప్రచార, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వయంసహాయక సంఘ సభ్యులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, అంగన్ వాడీ లు, ఆశా కార్యకర్తలను పూర్తిగా భాగస్వాములు చేయాలని కలెక్టర్ తెలిపారు. దోమల వ్యాప్తి నివారణకు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా, ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులను మరింత ముమ్మరం చేయాలని తెలిపారు. వాటర్ ట్యాంక్ లను క్లోరినేషన్ చేయడంతో పాటు గ్రామాలలో ప్రజలు వినియోగించే తాగునీటి శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్లో టెస్టులు చేయాలన్నారు. జిల్లాలో డెంగ్యూను పూర్తిగా అరికట్టేందుకు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో 15 రోజులు మరింత అప్రమత్తంగా నియంత్రణ చర్యల పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలలో నీటి నిల్వలు లేకుండా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో కూడా ప్రతిరోజు ''డ్రై డే'' కార్యక్రమాలు కొనసాగాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. డెంగ్యూ నియంత్రణ, ముందస్తు చర్యలపై వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా విస్తత అవగాహన ప్రచార కార్యక్రమాలు చేపట్టాల న్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా,మాలతి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి విద్యాచందన, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పుష్పలత, జిల్లా మలేరియా అధికారి డా,సంధ్య, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, డా, సైదులు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరీ, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా,రాజేష్, డా,కోటిరత్నం, జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలబాను, జిల్లా విద్యాశాఖాధికారి ఎల్లయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.