Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలేనే
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- 200 కార్లతో సంక్షేమ పథకాల అవగాహన ర్యాలీ
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పొందేందుకు ఏ అర్హత అవసరం లేదని, పేదరికాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని అందిచడం జరుగుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల వయో పరిమితిని 57 యేండ్లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ గురువారం ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన ర్యాలీని 200 కార్లతో భారీగా నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రభుత్వ జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానం నుంచి పట్టణ రహదారి మీదుగా మండలంలోని రామానగరం వరకు సాగింది. రామానగరం ప్రజలు ఎమ్మెల్యే సండ్రకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నీ ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. గతంలో రూ. 200 ఉండే ఆసరా పించన్‌ను కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అది రూ.2వేలకు చేరిందన్నారు. 24 గంల పాటు రైతులకు ఉచిత విద్యుత్తు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఇలా అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయలేని దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికలుండటం వల్ల ఒక్క హుజురాబాద్‌లోనే అంటూ కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దళితబంధు పథకం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణను సిద్ధం చేశారన్నారు. ఆగస్టు 30వ తేదీ నాటికి 57 యేండ్లు దాటిన వారంతా ఆసరా ఫించన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకు ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి 57 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరిని గుర్తించి దరఖాస్తు చేసుకొనేలా చూడాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామంలోని ప్రజా ప్రతినిధులు తీసుకోవాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం మండలంలోని గంగారం, సిద్దారం గ్రామాల్లో కార్ల ర్యాలీ, సభలు జరిగాయి. తొలుత సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, నాయకులు గాదె సత్యనారాయణ, దొడ్డా శంకరరావు, చల్లగుళ్ల నరసింహారావు, వల్లభనేని పవన్, ఎంపీటీసీలు తుంబూరు కృష్ణారెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరావు, పిడుగు సత్యం, పాలకుర్తి రాజు, అన్ని మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.