Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్నగర్:దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్నా నేటికీ సంచార జాతుల పట్ల వివక్ష సాగుతూనే ఉందని విభక్త సంచారజాతుల అభివృద్ధి సంక్షేమ కమిటీ దక్షిణ భారతదేశ సభ్యుడు తురుక నరసింహ అన్నారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం త్వరితగతిన అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో 60కి పైగా సంచార జాతులు, కులాలు ఉన్నాయని, వీరందరూ ఒకే చోట నివాసం ఏర్పర్చుకోకుండా తమ జీవనం కోసం గ్రామాలు తిరుగుతూ నేటికీ తమ కులవృత్తులను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారని అన్నారు. వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంచారజాతుల కులాలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఉన్నా ఆచరణలో మాత్రం ఖర్చు చేయడం లేదన్నారు. దీని వల్ల ఆశించిన అభివృద్ధి జరగడం లేదన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో వెంకారెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి ఉపేందర్, తహసీల్దార్లు విజయశ్రీ, రవీందర్, కార్తీక్, దామోదర్, సరిత, లక్ష్మణ్, బాబు పాల్గొన్నారు