Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీజనల్ వ్యాధుల కాలం వచ్చిందంటే చాలు ఎజన్సీ వాసులు ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని బిక్కు, బిక్కున గడపాల్సిందే... మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడి ప్రజలు ప్రైవేటు దవాఖాలకు క్యూ కడుతున్నారు. ప్రజారోగ్యంపై దృష్టి సారించాల్సిన వైద్యారోగ్యశాఖ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వైద్య శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేయడంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించక పోవడంతో సీజనల్ వ్యాధుల కాలంలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారనే చెప్పవచ్చు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్స్‌తో భాధపడుతున్నారు. ప్లేట్ లెట్స్ సైతం పడి పోవడంతో కార్పోరేట్ వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని చిన్నబండిరేవు, పెద్దనల్లబల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు డెంగ్యూ వైరల్ ఫీవర్స్ సోకగా ప్రైవేటు దశాఖానాల్లో వైద్యం పొందుతున్నారు. దీంతో పాటు చిన్ననల్లబల్లి, తూరుబాక, నర్సాపురం, మారేడుబాక, సీతారాంపురం గ్రామాల్లో సైతం వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు బాధపడుతున్నారు. ఒక పక్క కరోనా మరో పక్క విష జ్వరాలు ప్రభలుతుండడంతో మండల ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.
వేదిస్తోన్న వైద్య సిబ్బంది కొరత
మండలంలో మూడు ప్రభుత్వ వైద్య శాలలు ఉన్నప్పటికీ సిబ్బంది కొరత వేదిస్తోందనే చెప్పవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్షంగా మూలంగా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించకపోవడంతో ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువ కావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.. పర్ణశాల వైద్యశాలలో ఎల్టి పోస్టు గత నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో పాటు మేల్ సూపర్వైజర్, హెచ్ఈఓ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉండగా ఫీల్టు ఏఎన్ఎమ్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి, నర్సాపురం ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ వైద్యుడిగా ఉన్న మోకాళ్ల వెంకటేశ్వరరావును జిల్లా మలేరియా అధికారిగా, డిప్యూటి డీఎంహెచ్‌ఓగా అదనపు భాద్యతలు అప్పగించడంతో రెండేళ్లుగా డిప్యూటేషన్ వైద్యులే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు మేల్ సూపర్వైజర్ ఫోస్టు సైతం ఖాళీగా ఉంది.
దుమ్ముగూడెం వైద్యశాలకు ఒకే ఒక్క వైద్యుడు
మండల కేంద్రమైన దుమ్ముగూడెంలో 24 గంటలు వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్యశాలకు గత మూడేళ్లుగా ఒకే ఒక్క వైద్యడు విధులునిర్వహిస్తున్నారు. రెండో వైద్యడిని నియమించాలని ప్రజా ప్రతినిధులు సర్వసభ్య సమావేశంలో తీర్మాణాలు చేయడంతో పాటు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకు పోయినా నేటికి రెండో వైద్యుడిని నియమించని పరిస్థితి, దీంతో పాటు నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులు, రెండు ఫీట్లు ఏఎన్ఎమ్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్, ఎఫ్ఎన్ఓ, ఎమ్ఎన్ఓ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.