Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజురాబాద్‌కే పరిమితం కాకుండా
- రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి
- వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్
- సత్తుపల్లిలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ- సత్తుపల్లి
దళితబంధుకు సమాంతరంగా కూలిబంధును అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయంలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హుజురాబాద్‌లోని 25వేల దళిత కుటుంబాలకు రూ. 10లక్షలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు. గతంలో అట్టడుగు వర్గాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలన్నారు. దళితులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 6916 కుటుంబాలకు కేవలం 6266 ఎకరాలు మాత్రమే పంచి ఇంకా పంచడానికి భూమి ఎక్కడా లేదని దళితులను మోసం చేశారని ఆరోపించారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారస్ మేరకు 38 లక్షల ఎకరాలు పంచడానికి భూమి ఉందని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. సబ్‌ప్లాన్ ప్రకారం కేటాయించిన నిధులు ఉమ్మడి రాష్ట్ర పాలనలో రూ. 25వేల కోట్లను దారిమళ్లిస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ. 39వేల కోట్లను దారి మళ్లించి అన్యాయం చేశారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం 5,33,812 మంది దరఖాస్తు చేస్తే 1,16,759 మందికి మాత్రమే రుణాలిచ్చి మిగతా వారిని మోసం చేయడం జరిగిందన్నారు. వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భీం బాట నాయకులు గద్దల నారయ్య, దళిత సాహితీ వేదిక నాయకులు పిల్లి మల్లికార్జున్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గోళ్లమూడి శ్రీనివాసరావు, నాయకులు తడికమళ్ల దాసు, ఎన్డీ నాయకులు అమర్లపూడి శరత్, సీఐటీయూ నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, మోరంపూడి పాండురంగారావు, రైతుసంఘ నాయకులు రావుల రాజబాబు, వ్యకాస నాయకులు కువ్వారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, డీవైఎఫ్ఐ నాయకులు తడికమళ్ల రామకృష్ణ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులు తడికమళ్ల అర్జున్, వెంకట్రామయ్య పాల్గొన్నారు.