Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కల్లూరు : ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న 40 రోజుల్లోనే కొడుకు శవంగా మారటంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. పెనుబల్లి మండలం కరాలపాడు గ్రామానికి చెందిన మేకల రవి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. పెనుబల్లి మండలం గంగదేవి పాడుకు చెందిన అనూష, కర్రలపాడుకు చెందిన మేకల రవి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అనూష కల్లూరు మండలంలో కొర్లగూడెం గ్రామంలో ఏఈవోగా పని చేస్తుంది. మేకల రవి బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. వీరిరువురూ కులాంతర వివాహం ఆదర్శంగా ఉండాలని జూలై 11వ తేదీన నీలాద్రి గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దగ్గర్నుండి అనూష తండ్రి మా ఇంట్లో పది లక్షలు ఎత్తుకెళ్లారని పెనుబల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని మృతుని తల్లి పేర్కొంది. పోలీస్ స్టేషన్ నుండి తరచూ పోలీస్ స్టేషన్కు రమ్మని ఫోన్లు చేస్తున్నారని గంగదేవపాడు గ్రామ పెద్దలు కొందరు ఫోన్లు చేసి తరచూ బెదిరిస్తున్నారని ఆమె రోదిస్తూ చెప్పింది. రెండు లక్షల రూపాయలు ఇస్తాను నా కూతుర్ని విడిచిపెట్టమని రవిని బెదిరించాడని ఆమె తెలిపింది. గురువారం మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉండి మధ్యాహ్నం తర్వాత కల్లూరు వెళ్లొస్తానని చెప్పి మళ్లీ ఇంటికి రాలేదని ఇక్కడ శవమై కనిపించాడని ఆమె చెప్పింది. ఒక్కగానొక్క కొడుకుని బీటెక్ వరకు కూలినాలి చేసుకుని చదివించానని చేతికందిన కొడుకు తమను ఆదుకుంటాడని ఆ వృద్ధ దంపతులు మాకు దిక్కు ఎవరని రోదిస్తున్నారు. మా కొడుకుని వారె హత్య చేసి ఉంటారని ఆరోపిస్తోంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రవి ఘటనపై ఎస్ఐ యండి. రఫీ, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భౌతికకాయాన్ని పెనుబల్లి ఆస్పత్రికి తరలించారు.