Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణితో చర్చలకు కలిసిరాని టీబీజీకేఎస్
నవతెలంగాణ-మణుగూరు
ఇటీవల మణుగూరు సింగరేణి ఏరియాలోని ఓసీ2లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు వెంకన్న కుటుంబానికి న్యాయం చేయడంలో సింగరేణి యాజమన్యం కాలయాపన చేస్తుందని, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని యాజమాన్యంతో చర్చించి వినతి పత్రం అందజేశారు. సోమవారం అన్ని కార్మిక సంఘాలను చర్చలకు రావాలని సింగరేణి యాజమాన్యం పిలుపునిచ్చారు. కానీ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం మాత్రం ఇతర కార్మిక సంఘాలతో సమావేశానికి రాము అని చెప్పి ఒంటరిగానే చర్చలు జరపాలని షరతులు విధించడంతో సింగరేణి యాజమన్యం ముందుగా టిబిజికెఎస్ నాయకులతో చర్చించి, అనంతరం ఏఐటియుసి, సిఐటియు, ఇప్టూ, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్ తదితర యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేయడంతో ఆ బాధిత కుటుంబం ఆవేదన గురైంది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జీఎంకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా సమాన పరిహారం చెల్లించాలని ఆఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఆదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, సీపీఐ జిల్లా రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బి.అయోధ్య చారి, సీఐటీయూ నాయకులు టివిఎంవి ప్రసాద్, కోడిశాల రాములు, బిఎంఎస్ నాయకులు వీరమనేని రవీందర్, ఇప్టూ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.