Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పంట పొలాల్లో పెరుగుతున్న పాము కాటు
ఘటనలు
అ ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో
ఏఎస్వి ఇంజక్షన్లు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వర్షాకాలం వచ్చిందంటే చాలు విష పురుగుల సంచారం పెరుగుతోంది. ఎండా కాలం పోయి వర్షాకాలంలో కురిసే వానలకు తేళ్లు, జెర్రి పాములు, వానపాములతో పాటు వివిధ రకాల సర్పాలు ఇండ్లలోకి వస్తుంటాయి. దీంతో పాటు పంటల పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాలల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. బీడు భూములు, గడ్డి వాములు, బురద మడుగులు ఉండే ప్రాంతాలలో విష పురుగులు మరుగు ఏర్పరుచుకుని జీవిస్తుంటాయి. రైతులు వ్యవసాయ కూలీలు, అటవీ ప్రాంతాలలో నివాసం ఉండే ఆదివాసీలు, పంట పొలాల వెంబడి నివాసం ఉండే వారు ఏ మాత్రం నిర్లక్షం వహించినా, జాగ్రత్తలు పాటించక పోయినా విష పరుగుల కాటుకు గురయ్యే ప్రమాదం ఉందనే చెప్పవచ్చు.
అప్రమత్తతే సురక్షితం : వర్షాకాలంలో విష పురుగుల సంచారాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండటం వల్ల సురక్షితంగా ఉండవచ్చు. రాత్రి పూట వ్యవసాయ పనుల మీద రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో టార్చ్ లైట్ తప్పని సరిగా వెంట తీసుకుని పోవాలి. పొలం గట్ల మీద నడిచేటప్పుడు కాళ్లకు ప్లాస్టిక్ బూట్లు తప్పని సరిగా ధరించాలి. దీంతో పాటు పొలం గండ్లు తీసే సమయంలో ఆ ప్రాంతంలో పాములు ఉన్నాయో లేదో చూసుకోవా లి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, రాత్రి పూట వివిధ పనుల మీద బయటకు వెళ్లే వారు విధిగా జాగ్రత్తలు పాటిస్తే పాము కాటుకు గురి కాకుండా మనల్ని మనం రక్షించు కోవచ్చు.
పెరుగుతున్న పాము కాటు ఘటనలు: వర్షాలు తగ్గి ఉక్క పోత ఎండలు కొడుతున్నందును పత్తి చేలు, వరి పొలాలల్లో విష పురుగుల సంచారం ఎక్కువైందనే చెప్పవచ్చు. గత రెండు రోజులు వరుసగా ఇద్దరు గిరిజన మహిళా రైతులు విష పురుగుల కాటుకు గురయ్యారు. నందుల చెలక గ్రామానికి చెందిన సోడి రాజేశ్వరి అనే గిరిజన యవతిని జెర్రి పాము కాటు వేయగా, బుధవారం కె. రేగుబల్లి గ్రామానికి చెందిన కొర్సా బుచ్చమ్మ అనే గిరిజన మహిళ బుధవారం పత్తి చేలో గడ్డి పీకుతుండగా కుడి చేతిని గుర్తు తెలియని పాము కాటు వేసింది. కాగా వీరిద్దరిని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమయానుకూలంగా తరలించి ప్రాథమిక చికత్సలు అందించి యాంటి స్నేక్ వేనం ఇంజక్షన్లు అందించడంతో ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు...
అందుబాటులో ఏఎస్వీ ఇంజక్షన్లు : ప్రభుత్వ వైద్యశాలల్లో యాంటి స్నేక్ వేనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాము కాటు వేసిన సమయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలుపుతున్నారు. కొంత మంది పాము కాటు వేసిన సమయంలో పసర్లు, బూత వైద్యులను అశ్రయిస్తున్నారని దీని వలన విషం ఎక్కి మృతి చెందే అవకాశం ఉందన్నారు. మండలంలో ఉన్న మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పాము కాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.