Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైద్యుల నిర్లక్ష్యం కారణమంటూ బంధువుల
ఆందోళన
అ చర్చనీయాంశంగా మారిన ఆసుపత్రిలో
శిశువు మృతి ఘటన
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. భద్రాచలం డివిజన్ లోగల బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన బానోత్ రాజా, భార్య వెన్నెల మంగళవారం కాన్పు కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో పరీక్షలు చేసిన వైద్యులు శిశువు బాగానే ఉందని తెలిపారని బాధితులు చెప్పారు. నొప్పులతో ఇబ్బందులు పడుతుందని ఎన్నిసార్లు వైద్యులను పిలిచినా పట్టించుకోలేదని ప్రసవం అవుతుందని వచ్చి చూడండి అని చెప్పిన కూడా కనీసం వైద్యులు చూడటానికి రాలేదని వెన్నెల కుటుంబ సభ్యులు తెలిపారు. కాన్పు చివరి సమయంలో ఒకరు మాత్రం వచ్చి చూసారని, దీంతో పుట్టిన ఆడ శిశువు మృతి చెందిందని వారు తెలిపారు. శిశువు మృతి చెందిన విషయాన్ని వైద్యులు దాచి పెట్టారని వెన్నెల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులు ఆందోళన చేయడంతో ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆందోళనకారులను నచ్చ జెప్పేందుకు ప్రయత్నం చేశారు.
ఆసుపత్రిలో సిబ్బంది తీరు మారదా..?
భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రసవం జరిగే సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువులు అనారోగ్యం పాలవుతున్నారని ప్రసవం కోసం వచ్చిన వారు పేర్కొంటున్నారు. గర్భిణీల పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీ కేంద్రం భద్రాచలం పట్టణ ఆసుపత్రిలో ఇటువంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవ్వటం ఆందోళనకు గురి చేస్తుంది. జిల్లాలోనే అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు కలిగిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయి సూపర్డెంట్ లేకపోవడం కూడా సిబ్బంది నిర్లక్ష్యానికి కారణంగా వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
గతంలో కరోనా సమయంలో రెమిడిసవర్ కుంభ కోణంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వచ్చిన మచ్చ మాయక ముందే ఇలాంటి సంఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.
శిశువు మృతి పై సమగ్ర విచారణ చేపట్టుతాం :
డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ
ఏరియా ఆసుపత్రిలో శిశువు మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ నవతెలంగాణకు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. శిశువు మృతి ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. కరోనా సమయంలో భద్రాచల ఏరియా వైద్యులు రాత్రి పగలు కష్టపడి పని చేశారని తెలిపారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయాలు చేయకుండా సామరస్య పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.