Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ఆళ్లపాడు అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టినందువలన పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని సిపిఎం, కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్‌ను, రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. ఆళ్లపాడు అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో వారం రోజుల నుంచి కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఆళ్లపాడు గేటు నుంచే బోనకల్ గ్రామానికి చెందిన రైతులందరు తమ పొలాలకు వెళ్తున్నారు. అయితే అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి ఆళ్లపాడు రైల్వే గేటును పూర్తిగా మూసివేశారు. దీంతో రైతులు తమ పొలాలకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతుండటంతో రైతులు వెళ్లకుండా గేట్లు మూసివేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనికితోడు బోనకల్ మండల కేంద్రానికి రావాలంటే ఈ గేటు నుంచే మోటమర్రి, రాయన్న పేట, గోవిందాపురం ఏ, ఆళ్లపాడు గ్రామాల ప్రజలు రావాల్సి ఉంది. ఈ గేటు మూసివేయడంతో ఈ నాలుగు గ్రామాల ప్రజలు వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గేట్లు మూసివేయడంతో రావినూతల బైపాస్ మీదుగా బోనకల్ చేరుకోవాలంటే అదనంగా ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంది. రావినూతల బైపాస్ కూడా అత్యంత ప్రమాదకరంగా ద్విచక్ర వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం నాయకుడు చిన్నా లక్షాద్రి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గారి దుర్గారావు బుధవారం ప్రత్యామ్నాయ రహదారి పనుల ఏర్పాట్లను పరిశీలించారు. బోనకల్లు గ్రామం నుంచి వచ్చిన వరద నీరు వెళ్లేందుకు ఆనాడు గేటు సమీపంలో ఏర్పాటు చేసిన అండర్ బ్రిడ్జిని ప్రత్యామ్నాయ రహదారిగా రైల్వే అధికారులు గుర్తించారు. వరద నీరు వెళ్లే అండర్ బ్రిడ్జి పూర్తిగా లోతట్టుగా ఉంది. దీనిని ప్రత్యామ్నాయ రహదారిగా గుర్తించి పనులు ప్రారంభించారు. కానీ ఈ అండర్ బ్రిడ్జి లోతట్టు ఎక్కువగా ఉండటంతో వరద నీరు వెళ్లే విధంగా కింది భాగంలో పెద్ద బుర్రలు వేయవలసి ఉంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం వరద నీరు పూర్తి స్థాయిలో వెళ్లే విధంగా కాకుండా అతి చిన్న బుర్రలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బుర్రల పట్ల సిపిఎం, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బుర్రలు ఏర్పాటు చేయటం వలన నీరు వెళ్లే పరిస్థితి ఉండదని, పెద్ద బుర్రలను మాత్రమే ఏర్పాటు చేయాలని పనులు నిర్వహిస్తున్న వారికి సూచించారు. ఒకవేళ మీరు ఆ చిన్న బుర్రలు వేసినా తామే స్వయంగా వాటిని తొలగిస్తామని వారు హెచ్చరించారు. కాంట్రాక్టర్‌తో చెప్పి పెద్ద బుర్రలను వేయించాలని సూచించారు. ప్రత్యామ్నాయ రహదారిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేంత వరకు గేటు నుంచి రాకపోకలు కొనసాగించే విధంగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.