Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాలుగా ఉపయోగాలు జరుగుతాయని, ప్రధానంగా నేరాల నియంత్రణ చేయవచ్చునని వైరా ఏసిపి కొప్పు సత్యనారాయణ తెలిపారు. బోనకల్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిసి కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటు వలన నేరాలను తగ్గించటమే కాక నేరాలు జరిగిన తర్వాత వెంటనే కేసును త్వరితగతిన చేదించవచ్చునన్నారు. ప్రధాన కూడళ్ళలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే సంబంధిత వ్యక్తులను పట్టుకోవచ్చు అన్నారు. ఆకతాయిలను, అసాంఘిక శక్తులను కూడా వెంటనే గుర్తించవచ్చు అన్నారు. ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలు ఉంటే వాహనాల చోరీలకు పాల్పడిన వారిని కూడా వెంటనే గుర్తించటానికి ఓ సాధనంలా ఉపయోగ పడుతుందన్నారు. సంఘ విద్రోహ శక్తులను కూడా రెప్పపాటు సమయంలో గుర్తించవచ్చని అన్నారు. పోలీసుల నేర విచారణలో కూడా ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. మండల కేంద్రంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ అవగాహన సదస్సులో మధిర సిఐ ఒడ్డేపల్లి మురళి, బోనకల్ ఏఎస్ఐ దొండపాటి వెంకటనారాయణ, బోనకల్ సర్పంచ్ బుక్యా సైదానాయక్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.