Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామీణ వైద్యులు పరిధికి మించి
వైద్యం చేయరాదు
అ క్షేతస్తాయిలో పర్యటించిన
డీఎంఅండ్ హెచ్ఓ శిరీష
నవతెలంగాణ-ములకలపల్లి
గ్రామీణ వైద్యులు తమ పరిమితికి మించి వైద్యం చేయరాదని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శిరీష అన్నారు. శుక్రవారం మండలంలో గ్రామీణ వైద్యులకు ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో వారికి పలు సూచనలు చేశారు. ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని కోరారు. పరిమితికి మించి వైద్యం చేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని, పరిధి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండలంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా మంగపేట పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్పిటల్లో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలించారు. హాస్పిటల్లో మెటర్నిటీ వార్డు, లేబర్ రూమ్ ల్యాబ్‌లను పరిశీలించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఉదయలక్ష్మితో కలిసి మొగరాలగొప్ప గ్రామంలో డాక్టర్ అనిత ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు. పలువురు పేషెంట్లకు ఆరోగ్య సలహాలు ఇచ్చారు. అక్కడ నుండి స్థానిక మెడికల్ ఆఫీసర్‌తో కలిసి తిమ్మంపేట గ్రామం సందర్శించి నులిపురుగుల నివారణ కార్యక్రమం తీరును పరిశీలించారు. అక్కడ గ్రామ సర్పంచ్‌కు పలు ఆరోగ్య సలహాలు తెలియజేసినారు. మారుమూల గ్రామమైన పాత గుండాలపాడు గిరిజన గ్రామాన్ని సందర్శించి నులిపురుగుల నివారణ కార్యక్రమం ఎలా జరిగిందో పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వీరభద్రం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి నాగేంద్ర ప్రసాద్, సిహెచ్ఓ నాగభూషణం పాల్గొన్నారు.