Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సీజనల్ వ్యాధుల బారినపడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్న నేపధ్యంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సత్తుపల్లి మండలం రామగోవిందాపురంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. మండల వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ప్లేట్లెట్స్ పడిపోవడం లాంటి అనారోగ్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో విష జ్వరాలు ఒకవైపు, కరోనాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ప్రభుత్వానికి ముందుచూపు లేకుండా పోయిందని విమర్శించారు. అనారోగ్యాల బారినపడి వారంతా ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారిస్తే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలన్నారు. రామగోవిందాపురంలో మంచినీటి సమస్యను పరిష్కరిం చాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు కువ్వారపు లక్ష్మణరావు, రత్తయ్య, మంగయ్య, రమేశ్, కోలా వెంకటేశ్వరరావు, సుబ్బారావు, సీతారావమ్మ, నాగమణి పాల్గొన్నారు.