Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా పురపాలక సంఘ సాధారణ సమావేశం శుక్రవారం చైర్మన్ సూత కాని జైపాల్ అధ్యక్షతన జరిగింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్న పురపాలక సంఘంలో ఎజెండ రూపొందించే ముందు వార్డుల్లో సమస్యలేంటి ఏదైనా పెద్ద పని ఉంటే తీర్మానం చేయాలా లేదా అన్న కనీస సమాచారం లేకుండా లక్షల రూపాయల వ్యయంతో కూడిన మహాప్రస్థానం వ్యాన్ కొనుగోలుకు, డిప్యుటేషన్‌పై వచ్చిన కమిషనర్ జీతభత్యాల తీర్మానం ఆమోదం కోసం మమ్మల్ని సమావేశాలకు పిలుస్తారా అని పాలక టిఆర్ఎస్ పార్టీ, సీపీఎం, కాంగ్రెస్ కౌన్సిలర్లు ద్వజమెత్తారు. తొలుత 10 వ వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని పాలక సభ్యులతో సంప్రదించకుండా 48 అంశాల ఎజెండా ప్రవేశ పెట్టటం తమను అవమానించటమేనని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో 5 ఓవర్ హెడ్ ట్యాంకులు పూర్తి అయినా 8,80,000 లీటర్ల సామర్ధ్యం కలిగిన ట్యాంకులను పాలక వర్గ అసమర్థత వల్ల మిషన్ భగీరథ వాళ్ళు నేటికీ అప్పగించలేదని నందిని సమావేశంలో నిలదీశారు. పురపాలక సంఘంలోఅభివృద్ధి పనులకు టెండర్లు వేసి అగ్రిమెంట్లు చేసుకుని పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు ఇచ్చి పనులు పూర్తి చేయుటకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. శానిటరీ వర్కర్లకు వేతనాలు పెంచాలని, యూనిఫాంలు అందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలని అన్నారు. పల్లిపాడు కౌన్సిలర్ దనేకుల వేణు మాట్లాడుతూ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ తన వార్డుల్లో 10 వేల రూపాయల పనిచేయలేదన్నారు, మాదినేని సునీత మాట్లాడుతూ గత సమావేశంలో చర్చించి తీర్మానం చేసిన వాటినే అమలు చేయకుండా కొత్త తీర్మానాలు ఎందుకని ప్రశ్నించారు. 2వ వార్డు సభ్యురాలు బత్తుల గీత మాట్లాడుతూ తన వార్డుల్లో అభివృద్ధి పనులు కాదు కదా శానిటేషన్ వర్కర్స్ కూడా నెలల తరబడి రావటం లేదని, ఈ విషయాన్ని చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం లేదన్నారు. మునిసిపాలిటీ టెండర్ తదితర అధికారిక ప్రకటనలను ఒకే పత్రికకు ఇవ్వటం ఏంటని సభ్యులు ముక్తకంఠంతో ప్రశ్నించారు. కమిషనర్ సమాధానమిస్తూ, మునిసిపల్ శాఖ ఉన్నతాధకారులు ఐఎంపిఆర్ నిబంధనల ప్రకారమే సాక్షి పత్రికకు ఒక లక్షా ఐదు వేల రూపాయల ప్రకటన ఇచ్చినట్లు వివరణ ఇవ్వగా, సర్క్యులర్ చూపించాలని వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములుతో సహా సభ్యులు సర్క్యులర్ కోసం పట్టు బట్టారు. కమిషనర్ తన విషయం కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వైరా మునిసిపాలిటీ సాధారణ నిధుల నుండి తీసుకొనుటకు నేటి అజెండాలో చేర్చినట్లు కమీషనర్ ఎన్ వెంకట స్వామి తెలిపారు. సమావేశానికి సంబంధిత శాఖల అధికారులను రప్పించకుండా, చర్చించినా ఫలితం ఏముంటుందని కో ఆప్షన్ సభ్యులు అప్పం సురేష్ సమావేశం దృష్టికి తెచ్చారు. 14 వార్డు కౌన్సిలర్ డాక్టర్ డి కోటయ్య మాట్లాడుతూ దళితులు, బలహీన వర్గాలు అధికంగా ఉండే ప్రాంతాలలో పట్టణ ప్రగతిలో ప్రాధాన్యత లేదని అన్నారు. సమావేశంలో ఏఈ అనిత, మేనేజర్ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.