Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్రమంతటా చిత్తశుద్ధితో అమలు చేయాలి
అ కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంను రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు ఏకకాలంలో చిత్తశుద్ధితో అమలు చేయాలని ఈ పథకాన్ని దగా చేస్తే ప్రగతి భవన్పై దండయాత్ర చేస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మండలంలోని కాచిరాజు గూడెం గ్రామములో ''దళిత బంధు-దళిత సాధికారిత''పై సదస్సును సంఘం మండల అధ్యక్షులు కుక్కల సైదులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా స్కైలాబ్ బాబు హాజరై మాట్లాడుతూ కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు వాగ్దానం అయితే మాత్రం ప్రగతి భవన్ పైకి దళితులు దండ యాత్ర చేస్తారని హెచ్చరించారు. ఎస్సి సబ్ ప్లాన్ నిధులు 86 వేల కోట్ల రూపాయలు కేటాయించి 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 31వేల కోట్ల రూపాయలు మురగ పెడుతున్నారని విమర్శించారు. మూడెకరాల భూమి వాగ్ధానాన్ని ఆటకెక్కించారని విమర్శించారు. దళిత బంధును కెవిపిఎస్ సంపూర్ణంగా స్వాగతిస్తుందన్నారు. గతంలో వాగ్దానం చేసిన మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్సి కార్పొరేషన్ వంటి రుణాలు వంటి మోసాలను మరోసారి దళితులు భరించలేరన్నారు. బీజేపీ దేశవ్యాపితంగా ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఎందుకు రద్దు చేశారో దళిత,ఆదివాసీలకు జవాబు చెప్పాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల,మహిళలపై దాడులు పెరుగుతున్న బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజరులకు కనబడక పోవడం సిగ్గు చేటన్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి పారితోషికం రెండు లక్షల యాభై వేల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం వెనకబడిందన్నారు. ఎన్నో అప్లికేషన్లు గత ఏడాది కాలంగా పెండింగులో ఉన్నాయన్నారు. తక్షణమే ఆ నగదు విడుదల చేసి, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళను ఆర్థికంగా అదుకోవలన్నారు. ఎస్సి కార్పొరేషన్ రుణాలు గత వార్షిక ప్రణాళికలో ఎంపికైన లబ్ధిదారులకు నేటి వరకు సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుత సంవత్సరం కార్పొరేషన్ రుణాల ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సి కార్పొరేషన్ రుణాలు గత మూడేళ్ళుగా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ సంవత్సరం కూడా సబ్సిడీ ఋణాలివ్వకుండా మళ్ళీ మోసం చేస్తున్నదని, దీనిపైన రానున్న కాలంలో జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు.దళిత వాడల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని తక్షణమే వైద్యబృందాలు దళిత కాలనీలపై శ్రద్ద వహించి సరైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కాలనీలల్లో కనీస వసతులైన రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, సురక్షిత తాగునీరు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
సదస్సులో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీను, నందిగామ కృష్ణ, కేవీపీఎస్ మండల కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ, వ్యకాస మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావు, కేవీపీఎస్ మండల నాయకులు ఏపూరి వరకుమార్, మహంకాళి వీరబాబు, నూకల బాలరాజు, నందిపాటి లక్ష్మయ్య, ఆంథోని, గుగ్గిళ్ల వెంకటనారాయణ, ఎల్. సైదులు, ఆరేంపుల వీరభద్రం, వెలుతురు రామనాధం తదితరులు పాల్గొన్నారు.