Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని పొన్నెకల్లు గ్రామం వద్ద గల కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు జిల్లా గ్రీన్ ఛాలెంజ్ ఛాంపియన్షిప్ అవార్డును కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఖమ్మంలో అందజేశారు. భారత ప్రభుత్వ సంస్థ మహాత్మా గాంధీ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ వారు ఆన్లైన్లో విద్యాసంస్థల్లో స్వచ్ఛత కార్యక్రమాలు పచ్చదనం, పరిశుభ్రతపై ఇటీవల జాతీయ సర్వేను నిర్వహించారు. సర్వేలో జిల్లాలో పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కిట్స్ కళాశాల గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికయినట్లుగా మహాత్మాగాంధీ జాతీయ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా కిట్స్ కళాశాల వారికి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి కోట అప్పిరెడ్డి మాట్లాడుతూ పచ్చదనానికి ప్రతీకగా కళాశాల ఆవరణలో 185 రకాల చెట్లను పెంచుతున్నామన్నారు. నిరంతరం విద్యార్థులు, అధ్యాపకులు వాటిని పరిరక్షిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పన్నాల కృష్ణమూర్తి, అడ్మినిస్ట్రేటీవ్ అధికారి రంగా శ్రీనివాస్, అధ్యాపకులు సయ్యద్ షా, మూర్తి తదితరులు పాల్గొన్నారు.