Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మిర్చి కమీషన్ ఏజెంట్ చేతిలో ఓ రైతు మోసపోయి తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయాడని, బాధిత రైతుకి న్యాయం చేయాలని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు మార్కెట్లోని మిర్చి ఏజెంట్లను, పోలీసు అధికారు లను కోరారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బాధిత రైతు బొడ్డుపల్లి నరసింహారావు తో కలిసి శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. బోనకల్లు మండలంలోని ముష్టి కుంట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నరసింహారావుకు 5 నెలల క్రితం కరోనా వ్యాధి సోకింది. ఆ సమయంలో మిర్చిని మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితిలో లేడని తెలిపారు. దీంతో ఖమ్మంకు చెందిన సుదీర్ఘకాలం పాటు పరిచయమున్న కమిషన్ ఏజెంట్ షేక్ మదర్ సాహెబ్ పేరుతో తనకు చెందిన ఎండుమిర్చి 58 బస్తాలు సుమారు 22 కింటాలు ముప్పై నాలుగు కేజీలను ఖమ్మం అక్షరా ఏసీలో పెట్టించాడు. సుమారు ఈ మిర్చి విలువ మూడు లక్షల రూపాయల వరకూ ఉంటుంది. కరోనా వ్యాధి తగ్గిన తర్వాత పంట పెట్టుబడుల కోసం మిర్చిని అమ్ముకోవటానికి నరసింహారావు కమిషను ఏజెంటు వద్దకు వెళ్ళాడు. అయితే కుటుంబ కలహాలతో ఆ సమయంలో మదర్ సాహెబ్ పురుగుమందు తాగి అపస్మారక పరిస్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులకు విషయం వివరించాడు. దీంతో కుటుంబ సభ్యులు కమీషను ఏజెంటు హాస్పటల్ నుంచి కోలుకొని రాగానే మీ మిర్చిని అమ్మి పెడతామని హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మదర సాహెబ్ మృతి చెందాడు. భర్త మతి చెందిన తర్వాత అతని భార్య తన దగ్గర ఉన్న కోల్డ్ స్టోరేజ్ స్లిప్ లు తీసుకొనిపోయి అమ్ముకోవటానికి ప్రయత్నించగా నరసింహారావు అడ్డుకున్నాడు. ప్రస్తుతం మిర్చి కోల్డ్ స్టోరేజీ లోనే మిర్చి ఉంది అని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని ఉన్న అక్షర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, మార్కెట్లోని మిగతా కమీషన్ ఏజెంట్లు, మిర్చి కొనుగోలు దారులు, మార్కెట్ అధికారులు, పోలీస్ అధికారులు బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు కోరారు. విలేకర్ల సమావేశంలో మధిర వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, ముష్టికుంట్ల రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ పండగ సీతారాములు, ముష్టికుంట్ల ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ దొడ్డ నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు బొడ్డుపల్లి నాగ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.