Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు దక్కటమో ప్రాణం పోవటమో : బాధితులు
నవతెలంగాణ-కారేపల్లి
మెగా పార్క్ కోసం తమ పోడు భూమిని లాక్కొని పొట్టకొట్టవద్దంటూ బాధిత కుటుంబం చేస్తున్న దీక్ష శుక్రకవారంకు మూడో రోజుకు చేరుకుంది. పోడు భూమిలోనే బాధిత కుటుంబం బచ్చలి పొట్టెయ్య-మంగమ్మ కుటుంబ సభ్యులు పురుగు మందు డబ్బాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ దీక్షలకు పోడు రైతులు మద్దతు తెల్పుతున్నారు. ఆదివాసీ అమాయకులమని, తమ పోడు భూమిని స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి లాక్కొవాలని చూస్తుండ్రు అని బాధితుడు కుమారుడు కోడలు బచ్చలి కోటేశ్వరరావు -స్వర్ణలు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు దక్కటమో ప్రాణం పోవటమో ఇక్కడే జరగాలంటూ వారు భీష్మించు కూర్చున్నారు. అధికారులు తమ కుటుంబ పరిస్ధితిని మానవత్వంతో ఆలోచించటం లేదని వారు ఆరోపించారు. తమకు ఏమైన అయితే పూర్తి బాధ్యత అధికారులదేనంటూ పేర్కొన్నారు. బాధిత కుటుంబ నిరసనకు పోడు రైతులు ఎరిపోతు భద్రయ్య, బుగ్గ కోటేశ్వరరావు, మాలోత్ రాంకోటి, రాచర్ల లక్ష్మమ్మ, రణదీర్లు మద్దతు ప్రకటించి నిరసన దీక్షలో కూర్చున్నారు.