Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
తరతరాలకు ఆదర్శం విద్యుత్ ఉద్యమ పోరాటమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమిద్దామని వామపక్షాల నేతల పిలుపు నిచ్చారు. శనివారం వామపక్షాల అధ్వర్యంలో బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల 21వ సభ స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగింది. ఈ సభకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కునంనేని సాంబశివ రావు, సీపీఐ ఎంఎల్ జిల్లా నేతలు కందగట్ల సురేందర్, పి.సతీష్ మట్లాడుతూ సరిగ్గా 21 యేండ్ల క్రితం ఇదే రోజున విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష పార్టీల అధ్వర్యంలో శాంతియుతంగా హైదరాబాద్ నడిబొడ్డున ప్రదర్శన చేశారని తెలిపారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న ప్రజలను అతి కిరాతకంగా తెలుగు దేశం ప్రభుత్వం కర్కశ పోలీసుల భాష్పవాయువు ప్రయోగించి ప్రజలను రెచ్చ గొడుతున్న సందర్భంలో విపరీతమైన లాఠీ ఛార్జ్ చేసి, మహిళలలు అనే మానవత్వం లేకుండా, ప్రజలపై గుర్రాలతో తొక్కించి, ముగ్గురు యువ నాయకులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్రకు 21 యేళ్లు అయిందన్నారు. అదే ఉక్రోషంతో ఉన్న ప్రజలు అనంతరము జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, పార్టీనీ నామరూపాలు లేకుండా చేసి చరిత్రను సృష్టించిన తెలుగు ప్రజలకు జేజేలు పలికాలన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల అధ్వర్యంలో పేదలకు భారంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని 100 రోజులు ఉద్యమాన్ని కొనసాగిం చిన చరిత్రను గుర్తు చేసుకొని, భవిష్యత్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. బీజేపీ, తెరాస ప్రభుత్వాల విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. సామాజిక రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించి మంచి సమాజాన్ని నిర్మించే విధంగా పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాష, సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకులు ఎన్.సంజీవ్, వామపక్షాల నేతలు కొండ పల్లి శ్రీధర్, పద్మ, భూక్యా రమేష్, వై.శ్రీనివాస్ రెడ్డి, గుత్తుల సత్యనారాయణ, ఎంవి.అప్పారావు, అన్నవరపు సత్యనారా యణ, నాగేశ్వరావు, సందకూరి లక్ష్మి, రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం : విద్యుత్ ప్రయివేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావు అన్నారు. శనివారం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన విద్యుత్ అమరవీరుల బషీర్ బాగ్ కాల్పులుకు నిరసనగా అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాబురావు మాట్లాడారు. 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలను సుమారు రూ.వెయ్యి కోట్లు ప్రజలపై భారాలు మోపడాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ పోరాట స్ఫూర్తితో ఓడిపోయినదని, నేడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న విద్యుత్ వ్యవస్థను తన పరిధిలోకి తీసుకొని ప్రైవేటీకరించడం కోసం ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసి విద్యుత్ ప్రైవేటీకరించడం నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి. వెంకట రెడ్డి, బండారు శరత్ బాబు, పట్టణ నాయకులు పి. సంతోష్, నాగరాజు, శ్రీను, శాఖా కార్యదర్శులు శ్రీనివాస్, లక్ష్మి, వెంకటరమణ, సతీష్, నాగబాబు పాల్గొన్నారు.