Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ లబ్ధిదారులకు త్వరితగతిన అందించేలా చర్యలు
అ అధికారులకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ట్రైకార్, గిరివికాసం పథకాలను వేగవంతం చేసి లబ్ధిదారులకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం సమీకత గిరిజనాభివద్ధి సంస్థ భద్రాచలం ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుండి 2017-18 వరకు ట్రైకార్ పథకం కింద మంజూరు చేసిన పథకాల గ్రౌండింగ్ యూనిట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్స్, ధవీకరణలు, ఫొటోలను సెప్టెంబరు 13 నాటికి సమర్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాకుంల మేనేజర్లను కలెక్టర్ ఆదేశించారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేసిన రూ.17 కోట్ల 96 లక్షల నిధులను జనాభా ప్రాతిపదికన మండలాల వారీగా విభజించి ఈ నెల 7,8,9 తేదీలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు సూచించారు. గిరిజన లబ్ధిదారులందరికీ గిరి వికాస్ పథకం కింద విద్యుత్, బోర్లు, మోటార్లను సమకూర్చుటకు ప్రభుత్వం రూ.3. 47 కోట్లు మంజూరు చేసిందన్నారు. పనులన్నింటినీ త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గిరిజన అటవీ ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. అటవీ శాఖ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, విద్యుత్ శాఖ ఎస్.ఇ రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ రావు, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.