Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నకిలీ ధ్రువీకరణలతో వ్యవసాయేతర రుణాలు
అ బోర్డుమీటింగ్, మహాజన సభలో తీర్మానం
అ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని వివిధ శాఖల్లో నకిలీ ధ్రువీకరణలతో రుణాలు పొందిన 22 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తెలిపారు. వారికి సహకరించిన అధికారులు, ఉద్యోగులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ఎన్నెస్టీ బ్రాంచి నుంచి 20 మంది, రోటరీ నగర్ శాఖ ద్వారా ఒక్కరు, ఖమ్మం ప్రధాన కార్యాలయం నుంచి మరొకరు మొత్తం 22 మంది నకిలీ ధ్రువీకరణపత్రాలతో గత పాలకవర్గంలో రుణాలు తీసుకున్నారని వివరించారు. 2016లో వ్యవసాయేతర రుణాల కింద వీటిని మంజూరు చేశారన్నారు. తీసుకున్న రుణాల్లో కొందరు కొంతమొత్తం చెల్లించారన్నారు. వాయిదాల ప్రకారం రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో రుణగ్రహీతల ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించామన్నారు. ఆ సమయంలో నకిలీ ధ్రువీకరణపత్రాలతో రుణాలు పొందినట్లు గుర్తించామన్నారు. ఒక్కొక్కరు రూ.20 లక్షల చొప్పున 22 మంది రూ.4 కోట్లకు పైగా రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై చర్యలు తీసుకోవాలని బోర్డుమీటింగ్, మహాజన సభలో తీర్మానించామన్నారు. రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి రూ.కోట్లు దుర్వినియోగం చేసిన గత పాలకవర్గ బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలని మహాజన సభలో తీర్మానించామన్నారు. వీటిని కలెక్టర్ వీపీ గౌతమ్‌తో పాటు బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ కూరాకుల తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నివేదిక సమర్పించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఈవో అట్లూరి వీరబాబు, డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, జనగం కోటేశ్వరరావు, పునుకొల్లు రామబ్రహ్మం, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గన్నారు.