Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్తూపం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నివాళులు
నవతెలంగాణ-ఖమ్మం
బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమరవీరులకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ''జోహార్ విద్యుత్ అమరవీరులకు జోహార్'' ''నశించాలి నశించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి.....'' ''కాపాడుకుందాం, కాపాడుకుందాం ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందాం....'' ''రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లులు, రైతు వ్యతిరేక చట్టాలు'' అనే నినాదాలతో పెద్ద పెట్టున నినదించారు. అనంతరం 2000 సం.లో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్‌బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు బాసిన అమరవీరులకు వారి 21వ వర్థంతి సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన రామకృష్ణ స్తూపం వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ (ఎం.ఎల్.) జిల్లా కార్యదర్శి గోగినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావటానికి ప్రయత్నించారని విమర్శించారు. విద్యుత్ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ ఆనాడు 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ పోరాటం చేశామన్నారు. ఆనాటి పోరాటం, విద్యుత్ అమరవీరుల త్యాగాల వల్ల రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు క్రాస్ సబ్సిడీని పాలకులు ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జాబితాలోని విద్యుత్‌ను లాగేసుకొని సంస్కరణలు తీసుకురాబోతుందన్నారు. జి.ఎస్.టితో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిమీద దెబ్బ కొట్టారని వారు విమర్శించారు.
20 ఏండ్లు గడుస్తున్నా ఆనాటి విద్యుత్ పోరాట దృశ్యాలు కండ్ల ముందే మెదలాడుతున్నాయని అన్నారు. ఆనాటి ఘటన యాదృచ్ఛికమైనది కాదని, ప్రభుత్వ విధానాలకు సంబంధించినదని చెప్పారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. సంస్కరణలు, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలపై ఉందని, విద్యుత్ అమరవీరుల సాక్షిగా ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. విద్యుత్ పోరాటం, ముగ్గురు అమరవీరుల త్యాగాల వల్లే నేటికి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే పాలకులు భయపడుతున్నారని వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం నుంచి వైదొలగుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే విద్యుత్ సంస్కరణ వల్ల ప్రజలపై భారం పడే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్, యర్రా శ్రీను, వై. విక్రం, టి.లింగయ్య, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, మీరా, నవీన్‌రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వర రావు, క్లెమెంట్, సలాం, సాంబ శివారెడ్డి, పోటు కళావతి, ఎం.ఎల్. న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆవుల అశోక్, పుల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లిరూరల్: పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గంగారంలో అమరవీరులకు నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు, నాయకులు కావూరి వెంకటేశ్వరావు, హాసవత్ కృష్ణ, కువ్వారపు లక్ష్మణరావు, మద్ది శెట్టి పోచయ్య, జయరాజు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో విద్యుత్ అమరవీరుల వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు బందెల వెంకయ్య, నందిగామ కృష్ణ, ఏటుకూరి ప్రసాద్‌రావు, శ్రీను పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం గజ్జెల వెంకటయ్య భవనంలో అమరవీరుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) మండల కార్యదర్శి అంగిరేకుల నరసయ్య, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు శ్రీను, కొత్తపెళ్లి వెంకన్న, బింగి రమేష్, నాగేశ్వరరావు, గుగులోతు వీరన్న పాల్గొన్నారు.