Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫోటో పెట్టలేదు... ప్రోటోకాల్ పాటించలేదు
అ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా ఫైర్
అ ప్రారంభోత్సవ సభలో రగిలిపోయిన రేగా
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో నిర్మించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి తన ఫోటో ఫ్లెక్సీలలో ఏర్పాటు చేయలేదని, సభా వేదిక మీదికి ప్రోటోకాల్ పాటించి ఆహ్వానించలేదని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నిప్పులు చెరిగారు. కొత్తగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో ఆయన పాల్గొన్నారు. శనివారం రాత్రి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహం, వాటర్ ఫౌంటెన్, సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించారు. అనంతరం పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వేదికపైకి ప్రభుత్వ విప్ రేగా కాంతారావును ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, వనమా రాఘవేంద్ర రావుకు మాతో అవసరం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు ఆహ్వానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఎందుకు అవమానిస్తున్నారని మండిపడ్డారు. సభా వేదిక మీద ఒక్కసారిగా టీఆర్ఎస్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. సభా వేదిక మీదికి ఆహ్వానించే క్రమంలో వనమా రాఘవేంద్ర రావుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాఘవేంద్ర రావులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పలు దఫాలుగా బతిమిలాడారు. తన గడ్డం పట్టుకుని దండం పెట్టి తప్పులు మన్నించాలని వేడుకున్నారు. అనంతరం సభా వేదిక మీదికి వెళ్లిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తన ప్రసంగంలో మాట్లాడారు. ఈ విషయమై కలెక్టర్‌కు సభాముఖంగా ఫిర్యాదు చేస్తున్నానని, తర్వాత లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్టు, అసెంబ్లీ స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టు సభా వేదిక మీద ప్రకటించారు. సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహ ప్రారంభం సమయంలో ఆదివాసీ ప్రజాప్రతినిధికి అవమానం జరగడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం సభావేదిక పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.