Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
పార్టీ సిద్ధాంతానికి, విలువలకు జీవితాంతం కట్టుబడ్డ వ్యక్తి నర్వనేని సత్యనారాయణ అని, ఆయన మరణం పార్టీకి తీరనిలోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అమరజీవి నర్వనేని సత్యనారాయణ సంస్మరణ సభ శనివారం ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి తమ్మినేని హాజరై ప్రసంగించారు. కరోనా విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయ న్నారు. భారత్‌లో 50 కంపెనీలకు పైగా వ్యాక్సిన్ తయారు చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఇష్టులైన రెండు కంపెనీలకు మాత్రమే అనుమతిచ్చి నేటికీ కూడా ఒక డోస్ పూర్తి చేయని దుస్థితిలో ఉన్నాయని విమర్శించారు. ఇప్పుడు అమెరికా మాత్రమే అగ్రరాజ్యం కాదని, అన్ని రంగాల్లో చైనా సూపర్ పవర్‌గా ముందుకు వచ్చిందన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో రాష్ట్రంలో సీపీఎం మాత్రమే వ్యవహరించి పార్టీ కార్యాలయాలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి సేవలందించిందన్నారు. సమాజ మార్పుకోసం పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు, సిద్ధాంతాలకు ఆటుపోట్లు వచ్చాయని, అంత మాత్రం చేత సిద్దాంతం ఓడి పోవటం కానే కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు పూర్వవైభవం వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. ఆదర్శ కమ్యూనిస్టుగా పనిచేసిన సత్యనారాయణకి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ ఉద్యమంలో ఆటుపోట్లు, నిర్బంధాలు ఎన్ని వచ్చినా వెనకడుగు వేయక పని చేసిన ధన్యజీవి నర్వనేని అని నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన సత్యనారాయణ మరణం పార్టీకి పెద్ద లోటన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, నవతెలంగాణ జనరల్ మేనేజర్ ఎం.సుబ్బారావు మాట్లాడుతూ నర్వనేని భౌతికంగా అమరులైనా ప్రజల మనసులలో ఎప్పటికీ ఉంటారని అన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, తాతా భాస్కర్‌రావు, సామినేని రామారావు, సీపీఐ జిల్లా నాయకులు అడపా రామకోటయ్య, టిడిపి మండల అధ్యక్షులు చెరుకూరి చలపతిరావు, దూలిపాళ్ల నాగేశ్వరరావులు ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, మల్లేంపాటి వీరభద్రరావు, మాజీ ఎంపీపీ బొంతు సమత, ఐద్వా నాయకురాలు మచ్చా మణి, సీపీఎం వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి ఎస్ సుధాకర్, మండల నాయకులు పారుపల్లి కృష్ణారావు, యణమద్ది సత్యనారాయణ, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, మునిసిపల్ కౌన్సిలర్ కర్నాటి నందిని, రైతు సంఘం నాయకులు కర్నాటి హనుమంతరావు, మల్లెంపాటి రామారావు, నల్లమోతు వెంకట నారాయణ, శీలం వెంకటరెడ్డి కురుగుంట్ల శ్రీనివాసరావు బొడెపుడి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.