Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ క్రికెట్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మంచి క్రీడాకారులకు తయారు చేసేందుకు మున్సిపల్ పరిధిలో ఉన్న క్రీడా మైదానాలను వినియోగంలోకి తేవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులోని సాధన క్రీడా మైదానంలో కొత్తగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ క్రికెట్ కప్-2021, మహిళలకు మ్యూజికల్ చైర్స్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇల్లందు మున్సిపల్ టీము నుండి పోటీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో తాను క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేశారని మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. ఇల్లందు మున్సిపాల్టీ తరుపున పోటీలో పాల్గొన్న కలెక్టర్ మణుగూరు మున్సిపల్ టీముపై 25 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు సాధించారు. కొత్తగూడెం మున్సిపల్ టీము పాల్వంచ మున్సిపల్ టీము పోటీ పడగా కొత్తగూడెం మున్సిపల్ టీము విజయం సాధించింది. ఫైనల్ పోరులో ఇల్లందు, కొత్తగూడెం టీములు పోటీ పడగా కొత్తగూడెం టీము వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేయగా ఇల్లందు టీము 77 పరుగులకు ఆలైట్ అయ్యింది. ఫైనల్ పోటీలో కలెక్టర్ 11 పరుగులు చేశారు. అలాగే మహిళలకు నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ పోటీలో 15 మంది పాల్గొనగా కొత్తగూడెం 9వ వార్డు కౌన్సిలర్ రూప, ఇల్లందు కౌన్సిలర్ పద్మ సంయుక్త విజేతలుగా నిలిచినట్లు ఆయన చెప్పారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు బహుకరించారు. ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్లు కాపు సీతాలక్ష్మి, ఇల్లందు డి.వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, నాగప్రసాద్, కౌన్సిలర్లు రూప, పద్మ, విజరు, జమలయ్య, శ్రీనివాసరెడ్డి, పరమేష్ యాదవ్, ఇల్లందు కౌన్సిలర్లు సయ్యద్ అజాం, వాణి, పద్మ, శారద, తారా, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.