Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
చండ్రుగొండ మండలంలోని సీతాయిగూడెంలో గిరిజన సాగు దారులపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడులు, దౌర్జన్యంలతో హింసాయుతంగా కొట్టి గుర్రం రవి, బన్నే రాము రైతులు పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితికి నెట్టబడిన సంఘటన సరైంది కాదని, రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులపై దాడులు ఆపాలని లేని పక్షలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సీపీఐ(ఎం) నేతలు హెచ్చరించారు. ఆదివారం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతున్న పోడు బాదిత రైతులను పార్టీ జిల్లా బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పేద గిరిజన భూములలోకి ఫారెస్ట్ అధికారులు వందలాది మంది అక్రమంగా ప్రవేశించి గిరిజనులు సాగు చేసుకుంటున్న పత్తి, జొన్న పంటలను టాక్టర్లతో ధ్వంసం చేయడమే కాకుండా, వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారని రవి, రాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెబుతూ మరోపక్క ఫారెస్ట్, పోలీస్ అధికారులను పేద గిరిజన సాగు దారులపైకి ఉసిగొల్పి ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పోడు సాగు దారులపై దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతుంటాయని అధికారులు శాశ్వతంగా ప్రజల పని చేయవలసి వస్తుందని, ప్రజల సహాయ సహకారాలు లేకుండా తమ విధులను నిర్వహించలేరని, రక్షణ కల్పించవలసిన పోలీస్, ఫారెస్ట్ అధికారులు వీరే వీధి గుండాలాగా పేద గిరిజనులు, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలపై దాడులు చేసి క్రూరంగా హింసించి మరణాలకు కారణమవుతున్నారని ఇటువంటి దారుణ ఘటనలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పోడుసాగుదారుల జోలికొస్తే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని, ఇప్పటికైనా సాగుదారుల భూముల పైకి వచ్చి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, పట్టణ కార్యదర్శి భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.