Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార పార్టీలో రోజుకో రీతిలో అసంతృప్తి...అనైక్యతలు బయటపడుతున్నాయి. తమ హౌదాకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని...పిలిచి అగౌరవ పరుస్తున్నారని నిన్నటికి నిన్న పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆవేదన చెందారు. గిరిజనుడిని కాబట్టే తనకు సముచిత స్థానం కల్పించడం లేదని వాపోయారు. మంత్రి అజరు సాక్షిగా తనకు జరిగిన అవమానంపై కేసీఆర్, కేటీఆర్‌లకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు రాఘవ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంలోనే ఆదివాసి బిడ్డను అవమానించారని మండిపడ్డారు. కొత్తగూడెంలో 13 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం రవాణాశాఖ మంత్రి అజరుకుమార్ ఆవిష్కరించారు. దీనిలో భాగంగా పోస్టాఫీసు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వ విప్ ఇలా వాపోయారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లపైన కూడా తన పేరు, ఫొటో ముద్రించలేదన్నారు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన రేగా వేదిక మీదకు రానంటే రానంటూ కినుకు వహించారు. ప్రొటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ అయిన తనను ఇలా అవమానిస్తారా? మాకూ టైం వస్తుందంటూ రాఘవను నిలదీశారు. రాఘవ ఎంత ప్రాధేయపడినా రేగా స్టేజీ ఎక్కేందుకు నిరాకరించడంతో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చొరవ తీసుకుని సర్దిచెప్పి వేదిక మీదకు తీసుకెళ్లారు. ఇదిలావుండగా ఆదివారం బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. ప్రొటోకాల్ పాటించకుండా ప్రభుత్వ విప్ రేగాను అవమానించడమే కాకుండా దళితులను వర్గాలుగా చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ సంఘం నేతలు ఆరోపించడం కొసమెరుపు.
- అనాలోచితంగా ఆ ఎమ్మెల్యే మాటలు...
చిత్ర విచిత్ర మాటలు...వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఇటీవల మరోమారు తన మాటతీరుతో పార్టీని ఇరుకునబెట్టే పనిచేశారు.. తనూ ఇరుకున పడ్డారు. 'తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని, ఈ ప్రాంత వెనుకబాటు తనాన్ని, వివక్షకు గురైందన్న విషయాన్ని గ్రహించే ప్రత్యేక రాష్ట్రాన్ని ఆమె ఏర్పాటు చేశారన్నారు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు సైతం తెలిపారు. 'తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, పోరాడి సాధించుకున్నామని' సీఎం కేసీఆర్ పదేపదే అంటున్నా..రాములునాయక్ ఇలా వ్యాఖ్యలు చేయడంతో టీఆర్ఎస్ నేతలు ఖంగుతిన్నారు. ఇదే సందర్భంలో 'మావోయిస్టులు దేశభక్తులని, వారు చేసే పోరాటంలో న్యాయం' ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమయ్యాయి. ఈనెల 24న కారేపల్లి మండలం బక్కలతండాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ఈ మాటల దుమారం రేపారు. దీనికి రెండురోజుల ముందు వైరా ఎమ్మెల్యేకు మరో చేదు అనుభవం కూడా ఎదురైంది. 'నీకు ఓటేసి తప్పు చేశాం..నీకేం అర్హత ఉంది? రిగ్గింగ్ చేసి గెలిపిస్తే మమ్మల్నే పట్టించుకోవా? మా తండాకు ఎందుకు వచ్చావు' అంటూ కారేపల్లి మండలం వెంకటియా తండాలో తీజ్ వేడుకల్లో పాల్గనేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. ఒకప్పుడు తన అనుచరులు, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి చెందనవారే ఇలా ఎదురుతిరగడంతో నానాతంటాలు పడి అక్కడి నుంచి రాములునాయక్ బయటపడాల్సి వచ్చింది.
- అనైక్యత..ఆధిపత్యం...
ప్రజాభిమానాన్ని, నాయకత్వాన్ని బలవంతంగా లాక్కొనైనా ఉమ్మడి జిల్లాపై తన ఆధిపత్యాన్ని చూపాలని అధికారపార్టీలో ఓ కీలకనేత ప్రయత్నిస్తున్నారనే చర్చ సాగుతోంది. 'కారు'కు నాలుగు చక్రాల్లా ఉండాల్సిన ఉమ్మడి జిల్లా కీలకనేతల మధ్య ఆధిపత్య పోరుతో ద్వితీయ, తృతీయశ్రేణి నాయకత్వంతో పాటు కార్యకర్తలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సైతం సతమతమవుతున్నారు. 'ఏ ఎండకు ఆ గొడుగు పట్టలేక' విసిగి వేసారుతున్నారు. పదవులు లేకున్నా పార్టీ కార్యకర్తలు, నాయకులు పలువురు మాజీ ప్రజాప్రతినిధుల పంచన చేరడం 'ఆధిపత్య' నేతకు రుచించడం లేదు. తన నియోజకవర్గంలో ఒక్కొక్కరుగా తన వర్గీయులకే పదవులచ్చేలా చేసినా...పదవిపోయిన మరుక్షణం ఎంతమంది తనపట్ల విధేయులుగా ఉంటారనే విషయంలో 'ఆధిపత్య'నేత లెక్కలు వేసుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ తన పైచేయిని ప్రదర్శించేందుకు అవకాశం ఉన్న మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ చేసిన ఆయన కొత్తగూడెంపైనా అంతే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తనకు సమాంతరంగా ఎదుగుతారని భావిస్తున్న సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారనే వాదన ఉంది. దీనిలో భాగమే డీసీసీబీ మాజీ పాలకవర్గంపై చర్యలకు ప్రస్తుత పాలకవర్గం తీర్మానమనే చర్చ సాగుతోంది. దళితబంధు రూపంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అమాత్యయోగం పట్టనుందనే చర్చ కూడా ఆ 'ఆధిపత్య' నేతకు రుచించడం లేదని తెలుస్తోంది. త్వరలో జరిగే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఎంపికలోనూ తన విధేయులకే పదవులు దక్కేలా 'ఆధిపత్య'నేత చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కీలక నేతల్లో ఓ ఇద్దరు 'కాలం..మౌనమే' సమాధానమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల కోసం రోజులు లెక్కబెడుతూ వ్యూహాలు రచించే పనిలో ఉన్నారు. అసంతృప్తులు... అనైక్యత మధ్య కారుపార్టీలో గారు గత్తర నెలకొంది. ఎంత అసంతృప్తి ఉన్నా పైకి 'చిరునవ్వులు చిందిస్తూ' కేడర్ చెదరకుండా కీలక నేతలు ధైర్యం ప్రదర్శిస్తున్నారు.